తెలుగుదేశంపార్టీ వైఖరే చాలా విచిత్రంగా ఉంటుంది. తన వాళ్ళ ఎంతటి అవినీతికి పాల్పడినా, ఎంత అక్రమాలకు పాల్పడినా వెనకేసుకు రావటమే లక్ష్యంగా పనిచేస్తుంది. అదే ఎదుటి వాళ్ళు కరెక్టుగా ఉన్నా సరే తమకు ఇబ్బందులు వస్తాయనుకుంటే వాళ్ళపై ఎంతటి బురద పూయటానికైనా సరే ఏమాత్రం వెనకాడదు. ఈ విషయం ఇప్పటికే చాలా సందర్భాల్లో బయటపడింది. తాజాగా గీతం యూనివర్సిటి అక్రమాల  విషయంలో కూడా బయటపడింది. ప్రభుత్వానికి చెందిన 40 ఎకరాలను గీతం యూనివర్సిటి యాజమాన్యం కబ్జా చేసందన్న విషయం విశాఖజిల్లాలోని చాలామందికి తెలుసు. బాహాటంగా జరిగిన ఈ కబ్జా విషయం ఇప్పుడు మళ్ళీ చర్చనీయాంశమైంది.  ఎప్పుడు ఎందుకు చర్చనీయాంశమైందంటే యూనివర్సిటి కాంపౌండ్ వాలుతో పాటు ముఖద్వారాన్ని ప్రభుత్వం కూల్చేసింది కాబట్టే.





ఎప్పుడైతే ప్రభుత్వం కబ్జా చెరనుండి 40 ఎకరాలను విడిపించిందో వెంటనే టీడీపీ నేతలు అక్కడ వాలిపోయారు. వెంటనే ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా ఆందోళనలు మొదలుపెట్టేశాయి. ఇంకేముంది ఎల్లోమీడియా కూడా వెంటనే తమ బుర్రలకు పదునుపెట్టేసి గీతం యూనివర్సిటి ఆస్తిని ప్రభుత్వమే కబ్జా చేస్తోందన్నట్లుగా కలరింగ్ ఇచ్చేస్తోంది. నిజానికి క్షేత్రస్ధాయిలో జరిగింది  ఒకటైతే ఎల్లోమీడియా ప్రొజెక్టు చేస్తోంది మాత్రం మరోకోణంలో. గీతం యూనివర్సిటి కబ్జా చేసిన ప్రభుత్వ స్ధలం ఖరీదు సుమారు రూ. 800 కోట్లుంటుందట. ఇంతటి విలువైన స్ధలాన్ని ఓ ప్రైవేటు వ్యక్తి ఎలా కబ్జా చేయగలిగాడంటే అందుకు టీడీపీనే కారణం. ఎంవివిఎస్ మూర్తి అనే  ఓ పెద్దాయన టీడీపీలో దశాబ్దాల పాటు ఉత్తరాంధ్రలో చక్రం తిప్పారు. ఆయన ఇటు చంద్రబాబునాయుడే కాకుండా అటు నందమూరి బాలకృష్ణకు కూడా చాలా చాలా దగ్గర చుట్టం. అందుకనే ఆయన ఏమి చేసినా ఎదుటిపార్టీల్లో కూడా అడిగే వారే లేకుండా పోయారు.





అయితే కాలం ఎల్లకాలం ఒకేలా ఉండదు కదా. 2019 ఎన్నికల తర్వాత సీన్ రివర్సయిపోయింది. గీతం యూనివర్సటి కబ్జా చేసిన భూమి వివరాలను, కేసును ప్రభుత్వం బయటకు తీసింది. మొత్తం వ్యవహారంపై దర్యాప్తు చేయించి నివేదికను సిద్దం చేసింది. దాంతో  మూడు రోజుల క్రితం కాంపౌండ్ వాలును, ముఖద్వారాన్ని కూల్చేసింది. అంతేకాకుండా 40 ఎకరాలు ప్రభుత్వ భూమిగా బోర్డులు కూడా పెట్టేసిందట.  సరే ఈ మొత్తం మీద టీడీపీ నేతలు చేస్తున్న గోల భరించలేని విధంగా తయారైంది. విచిత్రమేమిటంటే నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఎలా కూల్చేస్తారంటూ అడగటమే. ఇంతగా మాట్లాడుతున్న నేతలు ఆ 40 ఎకరాలు గీతం యూనివర్సిటిదే అని మాత్రం చెప్పలేకపోతున్నారు.





మామూలుగా అయితే  ఏ చిన్న విషయానికైనా సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తున్న టీడీపీ నేతలు గీతం యూనివర్సిటి కబ్జా భూమి విషయంలో మాత్రం ఎందుకు సీబీఐ విచారణకు డిమాండ్ చేయటం లేదు. ఎందుకంటే తమ బండారమే బయటపడుతుంది కాబట్టి. భూ కబ్జా విషయంలో గీతం  తీగ లాగితే బహుశా చంద్రబాబు డొంకంతా బయటపడుతుందన్న టెన్షన్ పెరిగిపోతున్నట్లుంది. అందుకనే తమ ఆందోళనల్లో ప్రభుత్వాన్ని, ఉన్నతాధికారులను తిడుతున్నారే కానీ విచారణకు మాత్రం డిమాండ్ చేయటం లేదు. అందుకే ఆ లోటును ఏపి ప్రజాసంఘాల జేఏసీ చేసేసింది. గీతం యాజమాన్యం భూకబ్జాపై విచారణ చేయాలంటూ సీబీఐని జేఏసీ అద్యక్షుడు జేటీ రామారావు ఫిర్యాదు చేశారు.  ఈ ఫిర్యాదుపై సీబీఐ ఏ విధంగా స్పందిస్తుందనేది వేరే సంగతి. ఏపి ప్రజాసంఘాల  జేఏసీ చేసిన ధైర్యం కూడా టీడీపీ నేతలు ఎందుకు చేయటం లేదన్నదే ఇఫుడు ప్రశ్నగా మారింది.





ఆమధ్య నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ ను ప్రభుత్వం వేదిస్తోందని మాజీ ఎంఎల్ఏ, టీడీపీ నేత వంగలపూడి అనిత హైకోర్టులో ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు ఏకంగా సీబీఐతోనే విచారణ చేయిస్తోంది. మరి తన కళ్ళముందే  వందల కోట్ల రూపాయల విలువైన భూమి కబ్జా విషయం బయటపడినా అనిత ఎందుకు మౌనంగా ఉన్నారు. ఈ విషయంలో కూడా హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేయచ్చు కదా ?  సీబీఐ విచారణకు డిమాండ్ ఎందుకు చేయటం లేదు ? జరుగుతున్నది చూస్తుంటే  టీడీపీ తోకముడిచేసినట్లే అనిపిస్తోంది. ఎందుకంటే న్యాయవిచారణ లేకపోతే సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తే బయటపడేది టీడీపీ నేత కబ్జా వ్యవహారమే. అప్పుడు పోయేది చంద్రబాబు+టీడీపీ పరువే. అందుకనే తోకముడిచేసిందనే ఆరోపణలు వినబడుతున్నాయి. మొత్తం మీద తమ వాళ్ళయితే ఓ విధంగాను ప్రత్యర్ధులైతే మరో విధంగా వ్యవహరించే టీడీపీ నేతల నైజమే మరోసారి బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: