అతి సర్వత్ర వర్జయేత్ అన్నారు. అంటే.. మరీ ఓవర్ చేస్తే దెబ్బ తినక తప్పదు.. ఇప్పుడు చైనా విషయంలో అది మరోసారి రుజువు అవుతోంది. చైనాలో కమ్యూనిస్టు పాలన ఉన్న సంగతి తెలిసిందే. అంటే.. ప్రభుత్వం ఏం చెబితే అదే శాసనం.. మన ప్రజాస్వామ్య ఇండియాలో లాగా ఆందోళనలు.. నిరసనలు, రాస్తారోకోలు.. నిరాహార దీక్షలు ఉండవు. ప్రభుత్వాధినేత చెప్పాడంటే అది ఫైనల్. అందుకే దేశాభివృద్ధి పేరుతో చైనాలో కొన్ని విపరీత నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు అవి వికటిస్తున్నాయి.

వాటిలో ప్రధానమైంది.. ఒకే సంతానం విధానం. చైనాలో 1979 నుంచి సింగిల్ చైల్డ్ విధానం అమల్లో ఉంది. అంటే.. ఒకరి కంటే ఎక్కువ మందిని కంటే.. ప్రభుత్వానికి భారీగా జరిమానాలు కట్టాలి. ఆనాటి  పాలకుడు డెంగ్‌ సియావో పింగ్‌ జనాభా తగ్గించాలని ఈ ఏక సంతాన విధానాన్ని ప్రారంభించారు. అయితే.. ఈ పథకం అమలు చేసిన 40 ఏళ్ల తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే.. చైనా చేసిన అతి వికటించినట్టు స్పష్టం అవుతోంది.

ఈ 40 ఏళ్లలో ఏటా కోటి చొప్పున 40 కోట్ల జననాలను నివారించామని చైనా మురిసిపోయింది. కానీ.. దాని దుష్ఫలితాలు ఇప్పుడు అనుభవంలోకి వస్తున్నాయి. ఒకే సంతానం కావడం వల్ల ఎక్కువ మంది అబ్బాయిలనే కన్నారు. దీంతో స్త్రీల జనాభా తగ్గిపోయి.. లింగ నిష్పత్తి దెబ్బతిన్నది. ఇప్పుడు అబ్బాయిలు కోటి రూపాయలు పెడితే కానీ అమ్మాయి దొరకని పరిస్థితి వచ్చింది. అలాగే.. పని చేసే శ్రామికుల సంఖ్య తగ్గింది. దీంతో వారికి గిరాకీ పెరిగింది. జీత భత్యాలు పెరిగాయి. దీంతో పరిశ్రమలకు ఉత్పత్తి వ్యయం పెరిగింది.

ఒకప్పుడు చైనా సరుకు అంటే చౌక.. కానీ ఇక ముందు ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. ఉత్పత్తి వ్యయం పెరిగి చైనా ఎగుమతులు ఖరీదవుతున్నాయి. చైనాలో కుర్రాళ్ల కన్నా వృద్ధుల సంఖ్య వేగంగా పెరుగుతోంది.  2010లో చైనా జనాభాలో పనిచేసేవారు 70 శాతంగా ఉంటే.. అది మరో 30 ఏళ్లలో సగానికి సగం తగ్గిపోతుందట. సో.. గతంలో చైనా చేసిన అతి కారణంగా ముందు ముందు  చైనా ఆర్థికాభివృద్ధి బాగా దెబ్బ తినబోతోందన్నమాట.

మరింత సమాచారం తెలుసుకోండి: