తన గానామృతంతో ఆబాలగోపాలాన్ని ఊహల లోకంలో విహరింపజేసిన గాన గంధర్వుడు స్వర్గీయ ఘంటసాల వెంకటేశ్వరరావు. ఘంటసాల అనగానే ఆ మధుర గాయకుడే ప్రతి ఒక్కరి మనసును తాకుతాడు ఘంటసాల వెంకటేశ్వరరావు ( డిసెంబర్ 4, 1922[1] - ఫిబ్రవరి 11, 1974)  జన్మతః వచ్చిన గంభీరమైన స్వరముతో, పట్రాయని సీతారామశాస్త్రి (సాలూరు చిన్న గురువు) వద్ద క్షుణ్ణమైన శాస్త్రీయ సంగీత శిక్షణతో, తెలుగు సినీ సంగీతము ఒక విభిన్నమైన వ్యక్తిత్వాన్ని సంతరించుకోవడానికి దోహదపడ్డాడు. ఘంటసాల తెలుగు సినిమా తొలితరము నేపథ్యగాయకులలో ప్ర‌ముఖుడు. వ్యాఖ్యానంతో సహా అతను ఆలపించిన భగవద్గీత తెలుగు వారిలో అత్యంత ప్రజాదరణ పొందినది.ఘంటసాల 1922 డిసెంబర్ 4 న గుడివాడ సమీపములోని చౌటపల్లి గ్రామంలో ఘంటసాల సూర్యనారాయణ, రత్నమ్మ అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించాడు.


సూర్యనారాయణ మృదంగం వాయిస్తూ, భజనలు చేసేవారు. అతను ఘంటసాలను భుజం పైన కూర్చోబెట్టుకొని పాటలు పాడుతూ సంగీత సభాస్థలికి తీసుకెళ్ళేవారు. ఘంటసాల అక్కడ జరుగుతున్న భజనలు వింటూ పాటలు పాడుతూ నాట్యం చేసేవాడు. ఘంటసాల నాట్యానికి ముగ్ధులయి అతనును 'బాల భరతుడు ' అని పిలిచేవారు. ఘంటసాల 11వ ఏట సూర్యనారాయణ మరణించారు. చివరి రోజుల్లో అతను సంగీతం గొప్పదనాన్ని ఘంటసాలకు వివరించి ఘంటసాలను గొప్ప సంగీత విద్వాంసుడిని అవమని కోరారు. అతను మరణంతో ఘంటసాల కుటుంబ పరిరక్షణను రత్తమ్మగారి తమ్ముడు ర్యాలీ పిచ్చయ్య చూసుకోవడం మొదలుపెట్టారు.


1951లో పాతాళభైరవి విజయంతో ఘంటసాల పేరు ఆంధ్రదేశమంతా మారుమ్రోగింది. అప్పుడే మద్రాసులో ఇల్లు కొనుక్కొని తన కుటుంబాన్ని తీసుకువచ్చారు. తరువాత విడుదలైన మల్లీశ్వరి చిత్రంలోని పాటలు అత్యంత ప్రజాదరణ పొందడానికి సాలూరి రాజేశ్వరరావుసంగీతానికి ఘంటసాల గాత్రం తోడవడమే! 1953లో వచ్చిన దేవదాసు ఘంటసాల సినీజీవితంలో కలికితురాయిగా నిలిచిపోయింది. ఆచిత్రంలో తన నటనకంటే ఘంటసాల గాత్రమే తనకు ఇష్టమని అక్కినేని నాగేశ్వరరావు చెపుతుంటారు. 1955లో విడుదలైన అనార్కలి చిత్రం మరింత గొప్పపేరు తెచ్చింది. 1957లో విడుదలైన మాయాబజార్ సినిమా పాటలు తెలుగు సినీచరిత్రలో అగ్రతాంబూలం అందుకున్నాయి. 1960లో విడుదలైన శ్రీ వెంకటేశ్వర మహత్యం సినిమాలోని 'శేషశైలావాస శ్రీ వేంకటేశ ' పాటను తెరపైనకూడా ఘంటసాల పాడగా చిత్రీకరించారు. ఎటువంటి పాటైనా ఘంటసాల మాత్రమే పాడగలడు అన్నఖ్యాతి తెచ్చుకొన్నాడు. 1970 వరకు దాదాపు ప్రతిపాట ఘంటసాల పాడినదే! ఏనోట విన్నా అతను పాడిన పాటలే.


1969 నుండి ఘంటసాల తరచు అనారోగ్యానికి గురయ్యేవాడు. .1970లో అతనుకు పద్మశ్రీ అవార్డు లభించింది. 1971లో ఐరోపాలో, అమెరికాలో ప్రదర్శనలు ఇచ్చి సంగీతప్రియులను రంజింపచేసాడు.1972లో రవీంద్రభారతిలో ప్రదర్శన ఇస్తున్నపుడు గుండెనొప్పి అనిపించడంతో హాస్పిటల్లో చేరాడు. అప్పటికే మధుమేహంతో బాధపడుతూ ఉన్నాడు. చాలారోజులు చికిత్స అనంతరం హాస్పిటల్ నుండి డిశ్చార్జి అయ్యాడు. అప్పుడే అతనుకు భగవద్గీత పాడాలన్న కోరికకలిగింది. భగవద్గీత పూర్తిచేసిన తర్వాత సినిమా పాటలు పాడకూడదు అనుకున్నాడు. 1973లో భక్త తుకారాం, జీవన తరంగాలు, దేవుడు చేసిన మనుషులు మొదలైన హిట్ చిత్రాలకు పాటలు పాడాడు. 1974 నాటికి అతను ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఆస్పత్రిలో కన్నుమూసాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: