రాజ బాబు.. ఈయన అసలు పేరు పుణ్యమూర్తుల అప్పలరాజు. 1935 అక్టోబర్ 20వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లాలోని , నర్సాపురంలో.. శ్రీ పుణ్యమూర్తుల ఉమామహేశ్వర రావు, రమణమ్మ దంపతులకు జన్మించారు. రాజబాబు తన పాఠశాల చదువుకునే సమయంలోనే బుర్రకథను నేర్చుకోవడానికి శ్రీ అచ్యుత రామయ్య దగ్గర శిష్యుడిగా చేరారు. ఇక తన ఇంటర్మీడియట్ ముగిసిన తరువాత టీచర్ కోర్సులో  కూడా శిక్షణ తీసుకొని , ఆ తరువాత తెలుగు ఉపాధ్యాయుడిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తూనే మరో వైపు నాటకాలలో కూడా వేషం కట్టేవాడు. కొద్ది రోజుల తరువాత 1965 డిసెంబర్ 5 వ తేదీన లక్ష్మీ అమ్ములు  ను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కొడుకులు.. ఒకరు నాగేంద్రబాబు, మరొకరు మహేష్ బాబు.


హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈయన, దర్శకుడు గరికపాటి రాజారావు ప్రోత్సాహంతో సినిమాల్లోకి రావడానికి ముందు అడుగు వేసాడు. అనుకోకుండా మద్రాసు చేరుకొని అక్కడ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో సహ హాస్యనటుడు అయిన అడ్డాల నారాయణరావు గారి పిల్లలకు ప్రైవేటు కూడా చెప్పేవారు.  ఇక అడ్డాల నారాయణరావు గారే రాజబాబుకి "సమాజం" అనే సినిమాలో అవకాశం కల్పించారు. ఈ సినిమాలో అద్భుతంగా నటించడంతో ఆ తర్వాత "తండ్రులు -కొడుకులు, కులగోత్రాలు, మంచిమనిషి, స్వర్ణగౌరీ" మొదలగు చిత్రాలలో అవకాశాలు వచ్చాయి . ఇక స్వర్ణగౌరీ చిత్రంలో నటించినందుకు గాను 350 రూపాయలు మొట్టమొదటి పారితోషికాన్ని అందుకున్నారు.
ఇక ఈయన అంతస్తులు చిత్రంలో నటించినందుకు గాను 1300 రూపాయల రెమ్యునరేషన్ తీసుకోగా, ఆ తర్వాత ఈయన వెనుదిరిగి చూడలేదు. ఇక ఎన్నో చిత్రాలలో నటించి, తన కంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా ఈయన ప్రేక్షకాదరణ పొందిన జోడి మాత్రం రమాప్రభ గారు అని చెప్పవచ్చు. సోగ్గాడు లాంటి చిత్రాల ద్వారా రమాప్రభ - రాజబాబు జోడికి మంచి పేరు వచ్చింది. హాస్య నటుడిగానే కాకుండా కొన్ని సినిమాలను నిర్మాతగా మారి నిర్మించారు. ఈయన బాబ్ అండ్ బాబ్ ప్రొడక్షన్స్ పేరిట ఒక నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి, దీని ద్వారా ఎన్నో విజయవంతమైన సినిమాలను నిర్మించారు.
రాజబాబు నిజజీవితంలో ఒక మంచి మనసున్న వ్యక్తి. ఈయన తన పుట్టిన రోజు సందర్భంగా ప్రతి సంవత్సరం అప్పటి నటిమణుల్ని, నటులను గౌరవంగా సత్కరించేవారు. ఇక ఈయన బాలకృష్ణ , శివరామకృష్ణ, సూర్యకాంతం ,రేలంగి ,సావిత్రి మొదలగు ప్రముఖులను సత్కరించారు. అంతేకాదు ఎన్నో సంస్థలకు కొన్ని కోట్ల రూపాయల విరాళాలు కూడా ఇచ్చిన దాత. ఇక అంతే కాకుండా రాజమండ్రిలో చెత్తాచెదారాన్ని శుభ్రపరుస్తూ వుండే కార్మికులకు, అదే ఊరిలో దానవాయిపేటలోని తన భూమిని కూడా రాసిచ్చారు. ఇక కోరుకొండలో "రాజబాబు జూనియర్ కళాశాల" అనే ఒక కాలేజీ కూడా నిర్మించడం విశేషం.
ఆయన నటించిన చిత్రాలకు గాను తొమ్మిది సార్లు ఫిలింఫేర్ అవార్డులు, అలాగే మూడు నంది అవార్డులను కూడా గెలుచుకున్నారు. అలాగే శతాబ్దపు హాస్య నటుడిగా కూడా అవార్డు తెచ్చుకున్నారు. ఇన్ని మంచి కార్యాలు చేసిన ఈయన అనుకోకుండా ఫిబ్రవరి 14 1983లో గొంతు సమస్య తో, ఇంకా ఏవో కొన్ని కారణాలవల్ల స్వర్గస్తులయ్యారు.


మరింత సమాచారం తెలుసుకోండి: