ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. కోహ్లీతో పాటు సినీ నటి తమన్నాకు కూడా ధర్మాసనం నోటీసులు పంపింది. ఆన్‌లైన్లో జూదాన్ని ప్రోత్సహిస్తున్నందుకు గానూ వీరికి నోటీసులు పంపినట్లు కేరళ హైకోర్టు తెలిపింది. ఆన్‌లైన్ రమ్మీ గేమ్స్‌‌కు  వ్యవహరిస్తున్న టీమిండియా కెప్టెన్‌ విరాట్‌కోహ్లీ, హీరోయిన్ తమన్నా, మాలయాళ నటుడు అజు వర్గీస్‌లు బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారో చెప్పాలని బుధవారం నోటీసులు జారీ చేసింది. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వెబ్‌సైట్లకు సెలబ్రిటీలు ప్రచారం చేయడాన్ని ధర్మాసనం తప్పుపడుతూ.. వాటిని రద్దుచేయాలని కోరుతూ త్రిసూర్‌కు చెందిన పోలీ వర్గీస్‌ అనే వ్యక్తి కేరళ హై కోర్టులో పిల్ దాఖలు చేశారు.    

దీనిని విచారించిన హైకోర్టు తాజాగా నోటీసులు జారీ చేసింది. ఈ వ్యవహారంలో వివరణ ఇ‍వ్వాల్సిందిగా కేరళ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఆదేశించింది. కాగా, ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ గేమ్స్‌ను ప్రమోట్ చేస్తున్న పలువురు సెలబ్రిటీలు, క్రికెటర్లపై మద్రాస్ హైకోర్టు గతేడాది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆన్‌లైన్ బెట్టింగ్ గేమ్స్ వల్ల ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వీటిని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారని సెలబ్రిటీలను ప్రశ్నించింది. అంతే కాకుండా అలాంటి అప్లికేషన్లపై కఠిన చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

ఇదిలా ఉంటే వీరితోపాటు బాహుబలి నటుడు దగ్గుబాయి రానా, ప్రకాష్ రాజ్ లు కూడా ఈ ఆన్ లైన్ రమ్మీ అప్లికేషన్లకు సంబంధించిన ప్రకటనల్లో నటిస్తున్నారు. వీరిపై కూడా ఇంతకుముందు కోర్టుల్లో పిటిషన్ లు దాఖలయ్యాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లోనే తెలుగు రాష్ట్రాలు ఆన్ లైన్ రమ్మీ వంటి జూదపు ఆటలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు నిషేధించాయి. అంతకుముందు వరకు ఈ గేమ్ లలో అనేకమంది వాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: