ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ (MI), సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) మధ్య జరిగిన మ్యాచ్‌లో ఓ సరదా సంఘటన అందరినీ బాగా ఆకట్టుకుంది. మన టీమిండియా t20 కెప్టెన్, ముంబై స్టార్ సూర్యకుమార్ యాదవ్ (SKY).. సన్‌రైజర్స్ యువ కెరటం అభిషేక్ శర్మ జేబును సరదాగా చెక్ చేశాడు. మ్యాచ్ మధ్యలో జరిగిన ఈ ఫన్నీ సీన్.. వీరిద్దరి మధ్య ఉన్న స్ట్రాంగ్ ఫ్రెండ్‌షిప్‌ను కళ్లకు కట్టింది.

అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ మైదానం బయట మంచి దోస్తులు. ఇటీవల పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అభిషేక్ కేవలం 55 బంతుల్లోనే 141 పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఆ మ్యాచ్ తర్వాత, తన ప్రయాణంలో గైడ్ చేసినందుకు సూర్యకుమార్ యాదవ్‌కు అభిషేక్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాడు. మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్‌కు కూడా క్రెడిట్ ఇచ్చాడు. "యువీ పాజీకి, సూర్య భాయ్‌కి స్పెషల్ థ్యాంక్స్. ఇద్దరూ నన్ను ఎంతో సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఇన్నింగ్స్ త్వరలోనే వస్తుందని సూర్య భాయ్ ముందే చెప్పాడు" అని ఆ భారీ ఇన్నింగ్స్ తర్వాత అభిషేక్ అన్నాడు.

ఇక అసలు విషయానికొస్తే.. MI vs SRH మ్యాచ్‌లో అభిషేక్ 28 బంతుల్లో 40 పరుగులు చేసి మంచి ఊపుమీదున్నాడు. అప్పుడే సూర్య సరదాగా అభిషేక్ దగ్గరకు వచ్చి జేబు తడిమాడు. ఇదేం పనిరా బాబు అనుకుంటున్నారా? గత మ్యాచ్‌లో సెంచరీ తర్వాత SRH ఫ్యాన్స్‌కు థ్యాంక్స్ చెప్పడానికి అభిషేక్ జేబులోంచి ఓ చిన్న పేపర్ తీశాడు కదా, బహుశా అదే పేపర్ కోసం సూర్య సరదాగా వెతికి ఉంటాడని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అదన్నమాట సంగతి.

కానీ, పాపం, ఈ జేబు చెకింగ్ అభిషేక్‌కు పెద్దగా లక్ తెచ్చినట్లు లేదు. ఆ తర్వాత కొద్ది బంతులకే హార్దిక్ పాండ్యా బౌలింగ్‌లో ఔటయ్యాడు. సో, ఈసారి పాకెట్ చెక్ అతనికి అంతగా కలిసిరాలేదు. ఈ మ్యాచ్‌లో అభిషేక్ (40), హెన్రిచ్ క్లాసెన్ (28 బంతుల్లో 37) తప్ప మిగతా SRH బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోయారు. దీంతో సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 162 పరుగులే చేయగలిగింది.

ఈ టార్గెట్‌ను ముంబై ఇండియన్స్ చాలా ఈజీగా, కేవలం 18.1 ఓవర్లలోనే ఛేదించింది. ఛేజింగ్‌లో సూర్యకుమార్ యాదవ్ కూడా 15 బంతుల్లో 26 పరుగులతో తన వంతు పాత్ర పోషించాడు. మ్యాచ్ అనంతరం SRH కోచ్ డేనియల్ వెటోరి మాట్లాడుతూ.. మిడిల్ ఓవర్లలో తమ బ్యాటర్లకు పరుగులు చేయడం కష్టంగా మారిందని ఒప్పుకున్నాడు. ముంబై బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి, పరుగులు రాకుండా కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యారని మెచ్చుకున్నాడు.




మరింత సమాచారం తెలుసుకోండి: