సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెడుతున్నాడంటే.. త‌మ కోసం ఏదో ఒకటి చేస్తారు.. ఈ బాధ నుంచి బ‌య‌ట‌ప‌డేస్తారు.. అన్న భ‌రోసా ప్ర‌జ‌ల్లో ఏర్ప‌డుతుంది.. అని ప్ర‌ముఖ హాస్య న‌టుడు బ్ర‌హ్మానందం అన్నారు. తెలంగాణ గ‌డ్డ‌పై, హైద‌రాబాద్‌లో పుట్టి.. ఇక్క‌డి నీళ్లు తాగుతున్న వాళ్లు ఎవ్వ‌రుకూడా ఆకలితో అల‌మ‌టించొద్ద‌ని సీఎం కేసీఆర్ మాట‌లు చిర‌స్థాయిగా నిలిచిపోతాయ‌ని ఆయ‌న అన్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా ఇంటికే ప‌రిమితం అయిన ప్ర‌ముఖ హాస్య‌న‌టుడు బ్రహ్మానందం ఓ చానెల్‌తో మాట్లాడుతూ క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి ప్ర‌భుత్వాలు తీసుకుంటున్న చ‌ర్య‌ల గురించి మాట్లాడారు. ఈ సంద‌ర్బంగా తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి ఆస‌క్తిక‌ర‌మైన వ్యాఖ్య‌లు చేశారు. 

 

 కేసీఆర్ చాలా గొప్ప‌నాయ‌కుడు. కానీ.. ప్ర‌భువెక్కిన ప‌ల్ల‌కీ కాదోయ్‌.. అదిమోసిన బోయీలెవ్వ‌రు అని శ్రీ‌శ్రీ అన్నారు. కేసీఆర్ లాంటి గొప్ప‌నాయ‌కుడికి ఉద‌యం లేచిన‌ప్ప‌టి నుంచి, సాయంత్రం మ‌ళ్లీ అన్ని ప‌నులు ముగించుకుని ఇంటికి వెళ్లిన త‌ర్వాత‌ అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకుంటూ ఆరోగ్య‌వంత‌మైన ముఖ్య‌మంత్రిని కాపాడుతున్న‌ ఆ త‌ల్లి శోభాగారికి నా ధ‌న్య‌వాదాలు. అలాంటి వాళ్ల‌ను మ‌నం మ‌ర‌వొద్దు. నా తెలంగాణ‌లో ఎవ‌రూ ఆక‌లితో ప‌స్తుల‌తో ప‌డుకోకూడ‌దు... అని కేసీఆర్ అన్నారు.. ఇది చాలా గొప్ప నినాదం.. తెలంగాణ‌లోనే కాదు.. ప్ర‌పంచం లైబ్ర‌రీలో ఉండాల్సిన నినాదం అని బ్ర‌హ్మానందం పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. అంతేగాకుండా.. మంత్రులు కేటీఆర్‌, ఈట‌ల రాజేంద‌ర్‌..ఇలా తెలంగాణ నాయ‌కులంద‌రూ ప్ర‌జ‌ల‌కు మేమున్నామ‌న్నభ‌రోసాను ఇస్తున్నారు. ఇంత గొప్ప నాయ‌కులు ఉండ‌డం ప్ర‌జ‌ల అదృష్టం అని అన్నారు. క‌రోనా వైర‌స్ నుంచి కాపాడుకునేందుకు ప్ర‌జ‌లు త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ఆయ‌న సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: