
అయితే కొన్ని రోజుల నుంచి బంగారం రేటు తగ్గుతూ వస్తోంది. మంగళవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల తులం బంగారం ధర రూ.380 తగ్గి రూ.45,110కి చేరుకున్నది. 22 క్యారెట్ల ధర రూ.41,350గా ఉన్నది. అయితే రేటు తగ్గింది కదా.. కొనేద్దాం అనుకునే వారిని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఎందుకంటే.. బంగారం, వెండి దిగుమతులపై తగ్గే కస్టమ్స్ సుంకంతో ధరలు మరింత దిగే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న పార్లమెంట్లో ప్రకటించిన బడ్జెట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కస్టమ్స్ సుంకాన్ని 12.5 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గించారు.
అలాగే ఏప్రిల్ 1 నుంచి బడ్జెట్ నిర్ణయాలు అమల్లోకి వస్తుండటంతో బంగారం ధరలు ఇంకా దిగుతాయన్న అంచనాలు పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇదే జరిగితే 22 క్యారెట్ల తులం బంగారం ధర ఒకేసారి వెయ్యి దిగవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మున్ముందు మరింతగా తగ్గే వీలుందన్న ఊహాగానాలూ జోరుగా ఉన్నాయి. ఈ క్రమంలోనే త్వరలో తులం రూ.42 వేలకు రావచ్చన్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు డిమాండ్ పడిపోయింది. దేశీయంగానూ పెండ్లిండ్ల సీజన్ కూడా కాకపోవడంతో కొనుగోళ్లు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. అందుకే పుత్తడి ధరలు పతనం దిశగా పయనిస్తున్నాయని.. ఈ పతనం ఇంకా కొనసాగుతుందని నిపుణులు అంటున్నారు.