ఒక వైపు దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల మంట‌లు మండుతూనే ఉన్నాయి. లీట‌ర్ పెట్రోల్‌, లీట‌ర్ డీజిల్ ధ‌ర‌లు రూ.110 కి చేరువ‌లో ఉన్నాయి. దీంతో సామాన్యుడికి త‌న బతుకుబండిని న‌డ‌ప‌డ‌ప‌డం భారంగా మారింది. అలాగే, వంట గ్యాస్ బండా కూడా వంట‌గ‌దిలో గుది బండ‌గా మారింది. పుండుమీద కారం చ‌ల్లిన‌ట్టు ఇప్ప‌టికే త‌ల‌కు మించిన భారంతో బ‌తుకుతున్న సామాన్యుడి పై కూర‌గాయల ధ‌ర‌లు కూడా ప్ర‌తాపాన్ని చూపుతున్నాయి. దీంతో చాలి చాల‌ని జీతంతో బ‌తుకీడుస్తున్న సామాన్యుడి జీవితం మ‌రింత దుర్భ‌రంగా మారింది.


   ఏం తినేట‌ట్టు లేదు.. ఏం కొనేట‌ట్టు లేదు అనే సినిమా పాట ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌కు అద్ధం ప‌డుతోంది. నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌లు, పెట్రోల్-డీజీల్ ధ‌ర‌లు సామాన్యుడి నుంచి దూరంగా వెళ్తుంటే.. మ‌రోవైపు దేవ‌వ్యాప్తంగా కూర‌గాయ ధ‌రలు కూడా ఆకాశాన్నంటుతున్నాయి. కిలో టమాట 60 రూపాయలు , ఉల్లిగడ్డ 60 రూపాయలు పైగానే ప‌లుకుతోంది. అలాగే మిగ‌తా కూర‌గాయ‌లు కూడా ఇదే దారిలో ధ‌ర‌లు పెరుగుతూనే ఉన్నాయి. అలాగే మాసం ధ‌ర‌లు కూడా పెరిగిపోయాయి. కిలో చికెన్ ధ‌ర రూ.250 ద‌గ్గ‌ర్లో ఉంది.


   కూర‌గాయ‌ల ధ‌ర‌లు పెర‌గ‌డానికి గ‌ల కార‌ణాల‌ను చూస్తే.. పండించిన కూర‌గాయ‌ల‌ను ఒక ప్రాంతం నుంచి మ‌రో ప్రాంతానికి ర‌వాణా చేయ‌డానికే ఎక్కువ ఖ‌ర్చు అవుతోంది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల కార‌ణంగా ఈ ప్ర‌భావం కూడా కూరగాయ‌ల ధ‌ర‌ల పెరుగుద‌ల‌తో పాటు.. మిగ‌త నిత్యావ‌స‌ర వ‌స్తువుల ధ‌ర‌ల‌పై ప్ర‌భావం ప‌డుతోంది. అలాగే దక్షిణ భార‌త దేశంలో అకాల వ‌ర్షాలు కురుస్తున్న నేప‌థ్యంలో కూడా కూర‌గాయలు ధ‌ర‌లు పెర‌గడానికి కార‌ణం. ఫలితంగా పెట్రోల్‌, డీజిల్‌, వ‌ర్షాలు ప‌డ‌డం అన్ని క‌లిపి కూర‌గాయ‌ల ధ‌ర‌లు ఆకాశన్నంటుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందంటున్నారు మార్కెట్ యాజమాన్యాలు. దీంతో పెరిగిన ధ‌ర‌ల‌తో కూర‌గాయ‌లు కొనేందుకు ప్ర‌జ‌లు జంకుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: