ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత కాంగ్రెస్ – టీడీపీ మధ్య రాజకీయ యుద్ధం కొనసాగింది. రాష్ట్ర విభజన అనంతరం అదే పోరు టీడీపీ వర్సెస్ వైసీపీగా మారింది. ప్రజలు కూడా హంగ్ లేకుండా స్పష్టమైన తీర్పును ఇస్తూ వస్తున్నారు. జనసేన మూడవ పార్టీగా అవతరించినా, సరైన రాజకీయ వాక్యూం లేదన్న అంచనాతో కూటమిలో చేరి అధికారంలో భాగస్వామ్యం అయ్యింది. ఈ నేపథ్యంలో కొత్త పార్టీలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయన్నది చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీ పెట్టడం ఎవరికైనా సాధ్యమే. కానీ ఆ పార్టీకి అవసరమైన స్పేస్ ఉందా లేదా అన్నదే అసలు ప్రశ్న అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఐపీఎస్ అధికారి పీవీ సునీల్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపాయి. బీసీలు, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీ, కాపులు కలిసి ఒక బలమైన రాజకీయ వేదిక ఏర్పడుతుందని ఆయన ప్రకటించారు. అదే సమయంలో విశాఖలో వంగవీటి రంగా వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ‘రంగానాడు’ సభ రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.
ఈ సభకు వంగవీటి రంగా కుమార్తె ఆశాకిరణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమె రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని ప్రకటించకపోయినా, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి రంగా ఆశయాల సాధన కోసం పోరాడతానని స్పష్టం చేశారు. ఆమె ప్రసంగంలో టీడీపీ, జనసేన, వైసీపీపై విమర్శలు చేయడం రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆమె వైసీపీలో చేరుతారన్న వార్తలపై కూడా ఈ ప్రసంగం ఒకరకంగా సమాధానంగా మారింది. ఇక ఈ సభను నిర్వహించిన రాధా రంగా మిత్రమండలి నేతలు ఏపీలో బలమైన రాజకీయ శక్తిగా తాము అవతరిస్తామని ప్రకటించడంతో ఊహాగానాలు మరింత పెరిగాయి. ఆ రాజకీయ శక్తి అంటే కొత్త రాజకీయ పార్టీయేనా? ‘రంగానాడు’ పార్టీగా మారుతుందా? అన్న ప్రశ్నలు చర్చకు వచ్చాయి. సభలో పాల్గొన్న బీసీ నేత, తెలంగాణ ఎంపీ ఆర్ కృష్ణయ్య కూడా బహుజనుల ఐక్యతపై పిలుపునిచ్చారు. మొత్తంగా చూస్తే ఏపీలో బహుజన వర్గాల కోసం కొత్త రాజకీయ పార్టీ అవతరించే అవకాశం ఉందా లేదా అన్నది, ఆశాకిరణ్ రాష్ట్ర పర్యటనలు, ఆమె రాజకీయ దిశ స్పష్టత వచ్చిన తర్వాతే తేలనుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి