ఇటీవల జరిగిన కలెక్టర్ల సదస్సులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయాన్ని సీరియస్‌గా ప్రస్తావించినట్టు తెలుస్తోంది. సచివాలయాలు ప్రజలకు సేవలు అందించే కేంద్రాలుగా ఉండాలి కానీ, ఖాళీ భవనాల్లా మారకూడదన్నదే ప్రభుత్వ ఉద్దేశమని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇకపై సచివాలయ ఉద్యోగుల పనివేళలను పకడ్బందీగా మానిటరింగ్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతిరోజూ తప్పనిసరిగా సచివాలయానికి హాజరు కావాల్సిందేనని ఆదేశాలు జారీ అయ్యాయి. విధి నిర్వహణ నిమిత్తం బయటకు వెళ్లాల్సి వచ్చినా, పై అధికారుల నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సిందే. అంతేకాదు, సచివాలయం బయట ఉన్నా అక్కడి నుంచే తమ హాజరును నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం వ్యవహారాన్ని ట్రాక్ చేసేందుకు ప్రత్యేకంగా ఒక యాప్‌ను రూపొందిస్తున్నారని సమాచారం. ఆ యాప్ ద్వారా ఉద్యోగుల రాకపోకలు, పని సమయం, మూవ్‌మెంట్ అన్నీ రికార్డు అవుతాయని అంటున్నారు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో సరైన పర్యవేక్షణ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. గ్రామాల్లో పంచాయతీ అధికారులు, మునిసిపాలిటీల్లో కమిషనర్లు, కార్పొరేషన్లలో జోనల్ కమిషనర్లు పర్యవేక్షణ బాధ్యత వహించాల్సి ఉన్నా, అది పూర్తి స్థాయిలో అమలు కావడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దాంతో కొంతమంది సిబ్బంది దీనిని అలుసుగా తీసుకుంటున్నారని అంటున్నారు. ఇకపై అలా కాకుండా సచివాలయ సిబ్బంది పనితీరును కఠినంగా పర్యవేక్షించేందుకు ప్రభుత్వం వివిధ స్థాయిల్లో ప్రత్యేక అధికారులను నియమించనుంది. అలాగే ఇప్పటివరకు కొంతమందిని ఇతర శాఖల్లో ఖాళీల పేరుతో డెప్యుటేషన్‌పై పంపిన వ్యవహారాన్ని కూడా రద్దు చేశారు. దీంతో సిబ్బంది అంతా తప్పనిసరిగా సచివాలయాల్లోనే పని చేయాల్సి ఉంటుంది. మొత్తానికి గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థపై ప్రభుత్వం సీరియస్‌గా ఫోకస్ పెట్టిందని, రానున్న రోజుల్లో మరిన్ని కఠిన నిర్ణయాలు వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి