బ్యాంక్ ఖాతాదారులను కలవరపాటుకు గురి చేసే ప్రధాన అంశాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఒకటి. నిబంధనల ప్రకారం.. పొదుపు ఖాతాలో ఉండాల్సిన కనీస మొత్తం ఉంచకపోతే, పెనాల్టీ ఛార్జీలు వ‌సూల్ చేస్తారు. డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సౌకర్యాలు తాత్కాలికంగా నిలిపివేసే ప్ర‌మాదం ఉంటుంది. ఎక్కువకాలం మినిమమ్ బ్యాలెన్స్ లేకపోతే బ్యాంక్ ఖాతాను ఇన్‌యాక్టివ్ కూడా చేస్తారు. తక్కువ ఆదాయ వర్గాల ప్రజలకు మినిమ‌మ్ బ్యాలెన్స్ అంశం పెద్ద స‌మ‌స్య‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే పొదుపు ఖాతాదారులకు బిగ్ రిలీఫ్ ఇస్తూ పలు బ్యాంకులు ఈ నిబంధనను తొలగించాయి. ఈ జాబితాలో ఐదు బ్యాంకులు ఉన్నాయి. ఈ బ్యాంకుల్లో మీకు అకౌంట్ ఉంటే ఇక‌పై నో టెన్ష‌న్‌.


బ్యాంక్ ఆఫ్ బ‌రోడా.. 2025 జూలై 2న గుడ్‌న్యూస్ తెలిపింది. `చింత లేని బ్యాంకింగ్‌ను ఆస్వాదించండి.. ఇక‌పై కనీస బ్యాలెన్స్ నిర్వహించకపోయిన‌ ఎటువంటి ఛార్జీలు చెల్లించ‌క్క‌ర్లేదు. అన్ని సేవింగ్స్ ఖాతాల‌కు ఇది వర్తిస్తుంది.` అంటూ బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ప్ర‌క‌టించింది.


పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌.. మినిమమ్ బ్యాలెన్స్ లేనిపక్షంలో పెనాల్టీ ఛార్జీలు విధించే నిబంధనను తొలగిస్తున్నట్లు 2025 జూలై 1న అనౌన్స్ చేసింది. రైతులు, మహిళలు, తక్కువ ఆదాయ కుటుంబాలకు మద్దతు ఇచ్చేందుకే ఈ నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు పీఎన్బీ వెల్లడించింది.


ఇండియన్‌ బ్యాంక్‌..  పొదుపు ఖాతాల‌కు మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను మినహాయిస్తున్నట్లు ప్ర‌క‌టించింది. అయితే జూలై 7వ తేదీ నుంచి ఈ నిబంధ‌న అమ‌ల్లోకి వ‌స్తుంది.


స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా.. 2020లోనే మినిమమ్ బ్యాలెన్స్ నిబంధనను తొలగించింది. అప్ప‌టి నుంచి సేవింగ్స్ అకౌంట్ ఖాతాదారుల‌కు క‌నీస నిల్వ‌ల‌పై ఎటువంటి పెనాల్టీ ఛార్జీలు ప‌డ‌టం లేదు.


కెనరా బ్యాంక్‌.. పొదుపు ఖాతాలపై మినిమమ్ బ్యాలెన్స్ ఛార్జీలను వ‌సూల్ చేయ‌డం నిలిపివేస్తున్న‌ట్లు  ఈ ఏడాదిలో మే నెలలో ప్ర‌క‌టించింది. ఈ నిబంధ‌న‌ను జులై 1 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది. అన్ని సెవింగ్స్ ఖాతాలు, శాలరీ అకౌంట్స్, ఎన్నారైల ఎస్‌బీ అకౌంట్లు, మరికొన్ని ఇతర ఖాతాలకు ఇది వ‌ర్తిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: