ఇద్దరు ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు. ఇక ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. వాళ్ళ ప్రేమ వ్యవహారాన్ని ఇంట్లో చెప్పగా అమ్మాయి తరపు వాళ్లు మొదట ఒప్పుకోలేదు. తర్వాత ఎలాగోలా ఒప్పుకున్నారు. ప్రేమ జంటకు నిశ్చితార్థం కూడా చేశారు. ఇక ఇటీవల ఆ యువకుడు కాబోయే అత్తవారి ఇంటికి వెళ్లాడు. అక్కడ అతడికి చేపల కూర పులుసుతో విందు ఇచ్చారు. తన ప్రేయసి కొసరి కొసరి వడ్డిస్తుంటే పట్టరాని సంతోషంతో భోజనం చేశాడు ఆ యువకుడు. కానీ అంతలోనే షాకింగ్... ఆ భోజనం తిన్న కాసేపటికే అతడు వాంతులు చేసుకొని మరణించాడు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. కేరళలోని మున్నార్‌కు చెంది నిషాంత్ (30) చెన్నైలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. తమిళనాడులోని అరియలూరు జిల్లా గంగైకొండచోళపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి చెన్నైలోని ఓ ఆస్పత్రిలో పనిచేస్తోంది. వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. మొదట యువతి తరపు బంధువులు ఒప్పుకోలేదు. కానీ అతడు నచ్చజెప్పడంతో చివరకు ఎలాగోలా ఒప్పుకున్నారు. ఇటవలే నిశ్చితార్థం కూడా జరిగింది. మే 17న వివాహం జరగాల్సి ఉంది. ఐతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో తమిళనాడులో కఠిన ఆంక్షలు అమల్లో ఉన్నందున నిషాంత్ పనిచేస్తున్న కార్యాలయానికి సెలవులు ప్రకటించారు.

అయితే కేరళలో లాక్‌డౌన్‌తో అతడు సొంతూరికి వెళ్లలేక.. కాబోయే అత్త వారింటికి వెళ్లాడు. మంగళవారం అతడికి చేపల పులుసుతో భోజనం వడ్డించారు. అన్నం తిన్న కాసేపటికే నిషాంత్ వాంతులు చేసుకున్నాడు. ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు తెలిపారు. ఆ ఇంట్లో అందరూ బాగానే ఉన్నారు. నిషాంత్ మాత్రమే చనిపోయాడు. సరిగ్గా ఇక్కడే అనుమానాలు పెరిగాయి. నిషాంంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిశాంత్ ప్రియుడి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. తమకు ఏపాపం తెలియదని.. కాబోయే అల్లుడి ఎలా చంపుకుంటామని వారు వాపోయారు. ఐతే పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత ఈ వ్యవహారంపై మరింత క్లారిటీ వస్తుందని పోలీసులు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: