ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక‌వేళ ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు వ‌చ్చిన ప‌క్షంలో ప్ర‌జ‌ల్లో పార్టీల బ‌లాబ‌లాలు ఎలా ఉన్నాయో తెలియ‌దుగానీ ప్ర‌స్తుతం మైండ్ గేమ్ రాజ‌కీయాలు మాత్రం గ‌ట్టిగానే మొద‌ల‌య్యాయి. త‌మ‌పై ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు కూడా దీటుగా నిలిచే ప్ర‌తిపక్ష‌మే లేద‌ని వైసీపీ ప్ర‌భుత్వం చెపుతుండ‌గా క్షేత్ర‌స్థాయి ప‌రిస్థితులు చూస్తే ఆవిధంగా లేవ‌నే చెప్పాలి. ఎందుకంటే ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త కొన్ని వ‌ర్గాల్లో ఇప్ప‌టికే గ‌ట్టిగా క‌నిపిస్తోంది. అయినా ప్ర‌భుత్వం తాము అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాల‌తో ప్ర‌జ‌లంతా సంతృప్తిగా ఉన్నార‌ని విప‌క్షాల విమ‌ర్శ‌లు కేవ‌లం త‌మ ప్ర‌జాద‌ర‌ణ‌ను చూసి ఓర్వ‌లేక‌నేన‌ని చెప్ప‌డ‌మే కాదు.. సంక్షేమ ప‌థ‌కాల గురించి గొప్ప‌గా ప్ర‌చారం కూడా చేసుకుంటోంది. ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం టీడీపీ వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము ఘ‌న విజ‌యం సాధించ‌డం ఖాయ‌మ‌ని వైసీపీ ప్ర‌భుత్వాన్ని చిత్తుగా ఓడిస్తామ‌ని చెపుతోంది. అయితే పార్టీ అధినేత‌తో స‌హా అతికొద్దిమంది నాయ‌కుల‌ను మిన‌హాయిస్తే మిగిలిన నాయ‌కులు గానీ క్షేత్ర‌స్థాయిలో పోరాడే నాయ‌కత్వం గానీ అంత చురుగ్గా లేద‌నే చెప్పాలి. ప్ర‌భుత్వంపై గ‌ట్టిగా నిల‌బ‌డి పోరాటం చేయ‌గ‌లిగే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. అయినా తాము త‌ప్ప మ‌రో ప్ర‌త్యామ్నాయం లేద‌ని చెప్పుకునేందుకు ఆ పార్టీ ప్ర‌య‌త్నిస్తోంది.

ఇక‌ జ‌న‌సేన పార్టీ క్షేత్ర‌స్థాయిలో ఇంకా పూర్తి స్థాయిలో బ‌ల‌ప‌డ‌లేదు. కొన్ని చోట్ల పార్టీ నిర్మాణ‌మే లేని ప‌రిస్థితి. స‌మ‌స్య‌ల‌పై గ‌ట్టి పోరాటం చేయ‌గ‌ల యువ‌త ఆ పార్టీకి బ‌ల‌మే. కానీ బీజేపీతో పొత్తు కార‌ణంగా సొంత అజెండాతో ముందుకు వెళ్ల‌లేక దిశానిర్దేశం కొర‌వ‌డిన ప‌రిస్థితి. అమ‌రావ‌తి, విశాఖ ఉక్కు వంటి ప‌లు కీల‌క అంశాలను ఆ పార్టీ స‌రైన స్థాయ‌లో వినియోగించుకోలేక‌పోయింద‌నే చెప్పాలి. అయినా ఆ పార్టీ ఈసారి సీఎం అయ్యేది ప‌వ‌న్ కల్యాణ్ అని ఘంటాప‌థంగా చెపుతోంది. నిజానికి ఈ పార్టీల వైఖ‌రుల‌న్నీ చూస్తే ప్ర‌జ‌ల‌తో మైండ్ గేమ్ ఆడుతున్న‌ట్టే క‌నిపిస్తోంది. తాజాగా విజ‌య‌వాడ‌లో బీజేపీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన స్వామి వివేకానంద జ‌యంతి వేడుక‌ల్లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు సోము వీర్రాజు మాట్లాడిన మాట‌లూ దీనినే సూచిస్తున్నాయి. త‌మ మిత్ర‌ప‌క్ష‌మైన జ‌న‌సేన నాయ‌కుల మీటింగ్‌లో రాష్ట్రంలో మైండ్ గేమ్ న‌డుస్తోంద‌ని చెప్పార‌ని, ఆ త‌ర‌హా రాజ‌కీయాల‌కు బీజేపీ చెక్ పెట్ట‌నుంద‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర అభివృద్దిలో బీజేపీ, జ‌న‌సేన‌లు ప్ర‌ముఖ పాత్ర వ‌హిస్తున్నాయ‌ని కూడా తెలిపారు. కానీ అదెలాగో చెప్ప‌లేదు.. మ‌రి ఇదోర‌క‌మైన మైండ్ గేమ్ అనుకోవాలేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: