
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ మాజీమంత్రి నారాయణపై గతంలో కేసు నమోదైంది. అయితే.. నారాయణ దీన్ని హైకోర్టులో సవాల్ చేశారు. దీంతో ఆయనకు హైకోర్టులో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఉత్తర్వులపై వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కానీ.. నిందితుడు మాజీ మంత్రి అని రింగ్ రోడ్డు అలైన్ మెంట్ లో, భూసేకరణలో అనేక మార్పులు చేశారని ప్రభుత్వం ఆరోపించింది.
అంతే కాదు.. రాష్ట్ర ప్రభుత్వ విచారణ సంస్థలకు మాజీ మంత్రి నారాయణ సహకరించడం లేదని ప్రభుత్వం తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు. నిందితులు దర్యాప్తుకు సహకరించకపోతే బెయిల్ మంజూరు చేసిన న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చని సుప్రీం కోర్టు ధర్మాసనం సూచించింది. ఇదే సమయంలో కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇటీవల తెలుగు రాష్ట్రాలు తమ ప్రతీకార రాజకీయాలకు కోర్టులను వేదికలుగా చేసుకుంటున్నాయని వ్యాఖ్యానించింది.
ఇది మంచి పరిణామం కాదన్న సుప్రీం కోర్టు.. రాజకీయ ప్రతీకారాల్లోకి కోర్టులను లాగవద్దని వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలకు మరో కారణం కూడా ఉంది. తెలంగాణలో ఎమ్మెల్యేలకు ప్రలోభాల కేసులోనూ ఇదే ధర్మాసనం విచారణ జరిపింది. ఆ సమయంలో ఇరు పక్షాలకు చెందిన లాయర్లు హెచ్చు స్వరంతో వాదించుకున్నారు. దీంతో ఆగ్రహించిన సుప్రీంకోర్టు ధర్మాసనం పై వ్యాఖ్యలు చేసింది. ప్రతీకార రాజకీయాలకు కోర్టును వేదికలను చేయవద్దని సూచించింది. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఎంత రాజకీయ ఘర్షణ ఉందో సుప్రీం కామెంట్లను బట్టి తెలుస్తోంది.