కేసీఆర్ రైతుల కోసం యుద్ధం ప్రారంభించారు. ఏం యుద్ధం అంటారా.. నకిలీ విత్తనాలు, పురుగు మందులపై యుద్ధం. ప్రత్యేకించి నకిలీ విత్తనాలపై కేసీఆర్ సర్కారు సమరభేరి మోగించింది. ఈ విషయంలో కేసీఆర్ సర్కారు చాలా పట్టుదలగా ఉంది. కొన్ని రోజుల క్రితం జరిగిన ఓ సమీక్ష సమావేశంలో నేరుగా కేసీఆర్‌ ఈ విషయంలో ఏకంగా డీజీపీకే ఫోన్‌ చేసి నకిలీ విత్తనాలపై నిఘా పెంచి అరికట్టాలని కోరారు. ఈ విషయంలో పోలీసు వ్యవస్థ మొత్తం కదలాలని సూచించారు.

ఇలా కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగడంతో పోలీసు శాఖ ఈ విషయంలో గట్టిగానే పోరాటం మొదలు పెట్టింది. ఈ బాధ్యతలను నేరుగా జిల్లా ఎస్పీలే తలకెత్తుతున్నారు. ఎక్కడికక్కడ నిఘా పెంచారు. నకిలీ విత్తనాల మూలాలపై ఫోకస్ చేశారు. ఇప్పుడు ఈ పోరాటం ఫలితాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి. పలు జిల్లాల్లో ఇప్పటికే అనేక కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఏదో ఒక చోట నకిలీ విత్తనాల ముఠాల గుట్టు రట్టు వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

నిజానికి ఈ సమరం నిరంతరం సాగాలి. ఎందుకంటే.. నకిలీ విత్తనాలు అనేది రైతులకు చాలా సీరియస్ సమస్య. అసలే పెట్టుబడి సొమ్ముల కొరత, వర్షాలు, చీడపీడలు.. ఇలా అనేక అంశాలకు ఎదురీదుతూ రైతు పంటలు పండిస్తుంటాడు. ఆ ఆదాయంపైనే రైతు కుటుంబం ఆధారపడి ఉంటుంది. కానీ.. ఈ నకిలీ విత్తనాల కారణంగా రైతు ఆదాయ ప్రణాళిక తలకిందులవుతుంది. నకిలీ విత్తనాలతో పంట దిగుబడి రాక మళ్లీ అప్పుల్లో కూరుకుపోతాడు.

ఇలాంటి కీలక సమస్యపై ఏకంగా సీఎం స్థాయిలో పోరాటం ప్రారంభించడం నిజంగా మెచ్చుకోదగిన విషయం. ప్రభుత్వం చేస్తున్న ఈ పోరాటానికి రైతాంగం కూడా మద్దతు ఇవ్వాలి. తమకు తెలిసిన నకిలీ విత్తనాల సమాచారం పంచుకోవాలి. ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం, రైతులు.. అంతా ఏకమైతే నకిలీ విత్తనాల సమస్యకు పరిష్కారం లభిస్తుంది. రైతు జీవితంలో ఆనందం వెల్లివిరుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: