గ్రూప్‌ వన్‌ పరీక్ష.. రాష్ట్రంలో సివిల్స్ వంటి పరీక్షగా చెప్పుకోవచ్చు. అలాంటి పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడం ఏమాత్రం మంచిది కాదు. కానీ.. ఇటీవల ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ వన్‌ మెయిన్స్ పరీక్షల ఫలితాలు వివాదాస్పదం అయ్యాయి. మొదట ఈ పరీక్షా పత్రాలను డిజిటల్ వ్యాల్యుయేషన్ చేయించారు. అయితే దానిపై కొందరు కోర్టుకు వెళ్లడంతో మళ్లీ మాన్యువల్ వాల్యుయేషన్ చేయించారు.


అయితే.. ఈ రెండు ఫలితాల్లో తేడాలు వచ్చాయి. కోర్టు తీర్పు ప్రకారం మాన్యువల్ వాల్యుయేషన్‌ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఏపీపీఎస్సీ సిద్ధమైంది. దీనిపై మళ్లీ మరికొందరు కోర్టుకు వెళ్లారు. తాజాగా ఏపీ హైకోర్టు ఇప్పుడు ఏపీపీఎస్సీకి షాక్‌ ఇచ్చింది. గ్రూప్ 1 అభ్యర్థుల ఇంటర్వూ, నియామకాలకు హైకోర్టు అనుమతి ఇస్తూనే.. మెయిన్స్ పరీక్ష పత్రాలను కోర్టు ముందు ఉంచాలని చెప్పడం ద్వారా షాక్ ఇచ్చింది. ఈ గ్రూప్‌ వన్ నియామకాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు ఆదేశించింది.


గ్రూప్ వన్‌ మెయి్స్ రాసిన అభ్యర్ధుల సమాధాన పత్రాలు, పిటీషనర్ల మార్కుల జాబితా సీల్డ్ కవర్ లో కోర్టు ముందు ఉంచాలని హైకోర్టు ఆదేశించింది. వాస్తవానికి బుధవారం నుంచి ఇంటర్య్వూలు జరగబోతున్నాయి. ఈ ప్రక్రియను నిలుపుదల చేయాలని కోరుతూ కొందరు కోర్టుకు వచ్చారు.  హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.కృష్ణమోహన్  ఈ వ్యాజ్యాలపై సుదీర్ఘంగా విచారణ నిర్వహించారు.


తాము ప్రస్తుతం నియామకాలు చేపట్టటం లేదని ..ఇంటర్వూలు మాత్రమే జరుగుతాయని ఏపీపీఎస్సీ వాదించింది. అంతే కాదు.. ఏపీపీఎస్సీకి దురుద్దేశాన్ని అంటగట్టటం సరికాదని ఏపీపీఎస్సీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఈ కేసులో ఇరువురు వాదనలు విన్న న్యాయస్థానం ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులిచ్చింది . మెయిన్స్ రాసిన వారి పత్రాలు అన్నీ కోర్టుకు సమర్పించాలని కోరడం ద్వారా ఆ పత్రాలను మరోసారి పరీక్షించే అవకాశం ఉంది. అప్పుడు అసలు వాస్తవం నిగ్గు తేలే అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: