
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పనిచేస్తోన్న కాషాయదళం, కాంగ్రెస్ టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీ ఒక అస్ర్తంగా దొరికినట్టు అయింది. ఇప్పటికే అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుంటూ బీఆర్ఎస్ సర్కారు వైఫల్యాలను ఎండగడుతూనే.. క్షేత్రస్థాయిలో బలోపేతం అవుతున్న కాంగ్రెస్, బీజేపీలకు ఈ అవకాశం అందివచ్చింది. ఎన్నికల ఏడాది కావడంతో పోరాట పంథాలో దూసుకువెళ్లాలని కాంగ్రెస్, బీజేపీ భావిస్తున్నాయి. అందివచ్చిన అవకాశాలను వదలకుండా వాడుకోవాలని కాంగ్రెస్, బీజేపీ నిర్ణయించాయి.
అందుకే తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ పేపర్ లీకేజీ ఘటనపై దూకుడుగా ముందుకు వెళ్లాలని బీజేపీ రాష్ర్ట నాయకత్వాన్ని జాతీయ నాయకత్వం హైకమాండ్ ఆదేశించింది. బండి సంజయ్ నేతృత్వంలో నిరుద్యోగ మహాధర్నా చేసింది. మహాధర్నా కోసం బీజేపీ రాష్ర్ట నాయకత్వం పోలీసుల అనుమతి కోరింది. పోలీసులు అనుమతి నిరాకరించడంతో కోర్టును ఆశ్రయించి ధర్నాకు అనుమతి సాధించారు. ధర్నా విజయవంతం చేసేందుకు కాషాయదళం ప్రయత్నించింది.
మొత్తం మీద కాంగ్రెస్, బీజేపీ రెండూ.. పేపర్ లీకేజీ అంశంలో ప్రధానం తప్పిదం మంత్రి కేటీఆర్ దేనని, ఆయనను బర్తరఫ్ చేయాలనే డిమాండ్ ముందుకు పోతున్నాయి. పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన ప్రతి నిరుద్యోగికి ప్రభుత్వం లక్ష రూపాయలు ఇవ్వాలని, సిట్టింగ్ జడ్డీతో విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ మహాధర్నా తరువాత మిలియన్ మార్చ్ నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. మరి కాంగ్రెస్, బీజేపీ పోటాపోటీ ఆందోళనలో పై చేయి ఎవరిది అవుతుందో?