ఏపీలో కాపు సామాజిక వర్గం ఎక్కువ. గెలుపోటములను నిర్దేశించడంలో కాపులు కీలక పాత్ర పోషిస్తారు. అయితే పవన్ కల్యాణ్ తో పొత్తు పెట్టుకోవడం వల్ల కాపులు అంతా తమవైపే ఉంటారు అని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ సమయంలో జగన్ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలో చేర్చుకొని ప్రత్యర్థులకు షాక్ ఇచ్చారు. అయితే జనసేనకు ఇచ్చిన 21 సీట్లతో కాపులు అసంతృప్తిగా ఉన్నారని వైసీపీ అధిష్ఠానం భావిస్తోంది.


తద్వారా కాపులు అంతా 2019లో లాగా తమవైపే ఉంటారని ఆ పార్టీ విశ్వసిస్తోంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఇడుపుల పాయలో వైఎస్సార్ ఘాట్ గా విడుదల చేసిన ఎంపీ, ఎమ్మెల్యేల అభ్యర్థుల జాబితాలో సీఎం జగన్ కాపులకు పెద్ద పీట వేశారు. ఓ రకంగా చెప్పాలంటే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కన్నా కూడా ఎక్కువ సీట్లు ఇచ్చేలా జగన్ ప్లాన్ చేసినట్లు కనిపిస్తోంది.


ఎందుకంటే ఇప్పటి వరకు టీడీపీ విడుదల చేసిన జాబితా ప్రకారం.. రెండు విడతల్లో కలిపి 128 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 16 స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి. ఇందులో ఆ పార్టీ కాపులకు కేటాయించిన సీట్లు కేవలం ఎనిమిది మాత్రమే. ఇక జనసేన, బీజేపీ లెక్కలు తేలాల్సి ఉంది. ఈ మూడు పార్టీల మొత్తం కంటే కూడా జగనే ఎక్కువ సీట్లు ఇచ్చినట్లు కనిపిస్తోంది. తద్వారా తానే కాపులకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆ వర్గాన్ని ఆలోచనలో పడేశారు.


ఇదిలా ఉండగా.. వైసీపీ జాబితాలో కాపులకు 22 సీట్లను జగన్ కేటాయించారు. ఇది కాకుండా బీసీల్లో మళ్లీ కొంతమంది కాపుల కిందకి వస్తారు.  ఇందులో శెట్టి బలిజకు 3, తూర్పు కాపులకు 7, బలిజకి 1  సీటు కేటాయించారు. ఈ మొత్తం చూసుకుంటే కాపులకు 33 సీట్లు ఇచ్చినట్లు లెక్కలు వేసుకోవచ్చు. గతంలో పవన్ కల్యాణ్ కూడా ఈ కాపులంతా కలవాలి అని వ్యాఖ్యానించారు. మరి వైసీపీకి మించి కూటమి సీట్లు కేటాయిస్తుందా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: