కవిత – కేటీఆర్ సంబంధాల్లో నెలకొన్న ఉద్వేగాలు, బీఆర్ఎస్ లో కొనసాగుతున్న అంతర్గత రాజకీయాలు ప్రస్తుతం పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఫార్ములా, ఈ రేసు అవినీతి కేసు విషయంలో కేటీఆర్ పై దాడులు జరుగుతున్నాయని కవిత బహిరంగంగానే చెప్పడం గమనార్హం. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా, రాజకీయ ప్రతీకారంతో కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆమె ఆరోపిస్తున్నారు. బీజేపీ - కాంగ్రెస్ కలిసి రాష్ట్రంలోని బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నాయని ఆమె విమర్శలు తీవ్రతరం చేస్తున్నారు. నియోజకవర్గాల్లో తిరుగుతూ ప్రజలతో మాట్లాడుతున్నప్పుడు కవిత వేసే ఈ వ్యాఖ్యలు ప్రజల్లో సానుభూతి రేకెత్తించేలా ఉన్నాయని అనిపిస్తోంది. అయితే మరో వైపు, కవిత రాజకీయ వ్యవహార శైలిలో వచ్చిన మార్పు కూడా పార్టీ అంతర్గత వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. ఒక దశలో కేటీఆర్ పై ఆమె ఓపెన్‌గా విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి.
కానీ ప్రస్తుతం ఆ వైఖరిని పూర్తిగా మార్చుకుని కేటీఆర్ ను సమర్థించే విధంగా మాట్లాడుతున్నారు. ఆయనపై జరుగుతున్న దాడులు రాజకీయ కక్షతో కూడుకున్నవేనని ఆమె స్పష్టం చేస్తున్నారు. దీనితో కేటీఆర్ - కవితల మధ్య ఉన్న అంతరాలు తగ్గుతున్నాయా ? అన్న సందేహాలు వచ్చినా… కేటీఆర్ మాత్రం ఇప్పటికీ కవిత విషయంలో పూర్తి నమ్మకం చూపుతున్నట్లు కనిపించడం లేదు. ఆయన ఎప్పుడూ కవిత గురించి పాజిటివ్‌గా మాట్లాడకపోవడం, కుటుంబ కార్యక్రమాలకు కూడా ఆమెను దూరంగా ఉంచుతున్నట్టుగా కనిపించే తీరు ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది.
ఇక హరీష్ రావు విషయంలో కవిత స్పష్టంగా వ్యతిరేక ధోరణి కొనసాగిస్తున్నారు. పార్టీ నుంచి తనను సస్పెండ్ చేయడానికి ప్రధాన కారణం హరీష్ రానే అని ఆమె నమ్ముతున్నారన్న అభిప్రాయం బీఆర్ఎస్ శ్రేణుల్లో బలంగా వినిపిస్తోంది. హరీష్ రావు వల్లే కేసీఆర్, కేటీఆర్ కు సమస్యలు వస్తున్నాయని కూడా కవిత భావిస్తున్నారని చెప్పబడుతోంది. హరీష్ రావుపై అవినీతి ఆరోపణలు చేస్తూ, ఆయనను పార్టీ నుంచి బయటకు పంపాలనే ఆలోచన కూడా కవితలో ఉందని వర్గాల సమాచారం. ఈ వ్యాఖ్యలు, ఈ భావనలు బీఆర్ఎస్ లో అంతర్గతంగా వర్గపోరు మరింత తీవ్రం అయ్యే సూచనలు ఇస్తున్నాయి.
మొత్తం మీద కవిత ప్రస్తుతం ప్రజల్లో తిరుగుతూ తాను అన్యాయానికి గురవుతున్నానన్న భావనను బలంగా ప్రచారం చేస్తున్నా… కుటుంబంలో, పార్టీలో ఆమెకు ఉన్న సమస్యలు ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. కేటీఆర్ మద్దతు పూర్తిగా లభించకపోవడం ఆమెకు సవాలుగా మారగా… హరీష్ రావుపై ఆమె వ్యతిరేకత మరో పెద్ద వివాదానికి దారితీసే అవకాశం ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి