ఈ అందం చూడడానికి రెండు కళ్ళు చాలవు అనే మాట మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాము. ఈ అక్షర సత్యమైన మాటలు వికారాబాద్ లోని అనంతగిరి కొండలకు సరిగ్గా సరిపోతాయి. ఇది నిజామా కలయా అనే రీతిలో మనసును మైమరిపించే సొగసులను సొంతం చేసుకున్న అనంతగిరులు ఇన్నాళ్లు తన ఒడిలో దాచుకున్న అంద చందాలతో తన ఒడి చేరిన వీక్షకుడి వినోదాన్ని అనంతం చేస్తోంది.

వివరాలలోకి వెళితే హైదరాబాద్ మహా నగరానికి అతి సమీపంలో లో కేవలం 80 కిలోమీటర్లు దూరంలో వికారాబాద్ పట్టణం చుట్టూ ఆరబోసిన అందాల అనంతగిరి కొండలు వ్యాపించిఉన్నాయి. దట్టమైన చిట్టడవుల శ్రేణులు, ఇదిగో చూసి తరించండి అంటూ తన కొండను చీల్చి జాలువారుతున్న జలపాతాలు,ఒంపు ఒంపులో సొంపుల సోయగాలు,చల్లగా వీచే పిల్లగాలులు,పలకరించే పచ్చని అందాలు,ఇలా వర్ణిస్తూ పోతే మాటలు చాలని ప్రకృతి ప్రదేశం ఈ అనంతగిరి.

కృష్ణ నది ఉపనది అయిన మూసి జన్మస్థానం అయిన ఈ ప్రకృతి ప్రదేశం ఒక పుణ్యక్షేత్రం కూడ. అడవి మధ్యలో వెలసిన అనంతరం పద్మనాభుని ఆలయం,దానికి అనుకోని ఉన్న కోవెల,దాని చుట్టుపక్కల వ్యాపించి ఉన్న చారిత్రక కట్టడాలు ఇవన్నీ అనంతగిరి కి ఉన్న చారిత్రక ప్రాముఖ్యత ను తెలియజేస్తాయి. అటవీ ప్రాంతం విస్తీర్ణం ఎక్కువగా ఉండటం, భౌగోళిక అమరిక దృష్ట్యా ఈ ప్రాంతం చల్లగా ఉండడం వల్ల దీనిని తెలంగాణ ఊటీ గా పిలుస్తారు.ఇలాంటి ప్రకృతి ప్రదేశం హైదరాబాద్ మహా నగరానికి అతి సమీపంలో ఉండడం మూలాన వారాంతాలలో ,విహార, విజ్ఞాన యాత్రలకు గమ్య స్థానం అయింది.

సుదూర ప్రాంతాల నుండి వచ్చే టూరిస్టుల విడిది మరియు విశ్రాంతి కోసం తెలంగాణ టూరిజం శాఖ సకల సౌకర్యాలతో హరిత రిసార్ట్స్ ను ఏర్పాటు చేసింది.చాలామంది టూరిస్టులు ఈ ప్రకృతి సోయగాన్ని తమ కెమెరా లలో బందించి ఆనందిస్తూ ఉంటారు.ఈ అడవిలో దాదాపు 290 జాతుల పక్షులు,జింకలు,పార్కుపైన్స్,పీకక్స్, మరెన్నో వన్యప్రాణులు సంచరిస్తుంటాయి.నగరానికి సమీపంగా ఉండడం, ప్రకృతి పరంగా అందమైన ప్రదేశం కావటంతో పలు సినిమా షూటింగ్ లు కూడ జరుగుతాయి.

ఈ ప్రదేశానికి అతి సమీపంలో బుగ్గ రామేశ్వరాలయం, పులుసుమామిడి శైవ క్షేత్రం ప్రత్యేకతను కలిగి ఉన్నాయి. అనంతగిరి అడవిలో అనేక వనమూలికలు ఇచ్ఛే చెట్లు ఉండడం వలన గాలి పీల్చినా రోగం నయం అవుతుందనే విశ్వాసం ఈ ప్రాంత వాసులలో ఉంది.
"అనంతగిరి కా హవా.....హైదరాబాద్ కా దవా ""అనే నానుడి అనంతగిరి కొండల యొక్క వైద్య ప్రాముఖ్యతను తెలియజేస్తాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: