పిల్లలను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. చిన్నపిల్లలు చేసే అల్లరిని చూసి చాల మంది ముద్దు చేస్తుంటారు. అయితే అప్పుడే పుట్టిన పిల్లలకు, చంటి బిడ్డలకు రోగ నిరోధక వ్యవస్థ అంత సమర్థంగా ఉండదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అందువల్ల చంటి బిడ్డలను కొన్ని వారాల పాటు కన్నతల్లి కంటికి రెప్పలా కాపాడుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

ఆ సమయంలో ఎలాంటి వైరస్ గానీ, ఇన్‌ఫెక్షన్ గానీ పిల్లలకు సోకితే ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు. వైద్యులు చెబుతున్న విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే.. చంటి బిడ్డలు ఉన్న ఇంట్లో పెద్దలు కొన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలన్నారు. పిల్లలను ఎత్తుకునే ముందు చేతులను శుభ్రంగా కడుక్కుని ఆ తర్వాతే ఎత్తుకోవాలని సూచించారు. ఎందుకంటే.. ఎన్నో వ్యాధికారక సూక్ష్మజీవులకు మన చేతులే నివాసమని గుర్తుంచుకోవాలి. చేతులు మాత్రమే కాదు, మన ముఖంపై కూడా కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మ జీవులు ఉంటాయి. వాటిలో హాని కలిగించేవి కూడా ఉంటాయన్న విషయం మర్చిపోకూడదు.

అంతేకాక పొరపాటున చేతులు, కాళ్లూ, ముఖం కడుక్కోకుండా చంటి బిడ్డలను ఎత్తుకోవడం గానీ, పెదాలతో ముద్దాడటం గానీ చేస్తే మనకు తెలియకుండానే వారిని ప్రమాదంలోకి నెట్టేసిన వారవుతాం. శిశువుల్లో చాలామంది హెచ్‌ఎస్‌వీ-1 బారిన పడుతుంటారు. ఈ వైరస్ సోకిన పెద్దల్లో పెదాలు, నోరు వద్ద దద్దుర్లులా వస్తుంటాయి.

అయితే.. ఈ వైరస్ సోకిన తొలి దశలో అలాంటి లక్షణాలేవీ కనిపించవు. అలా కనిపించకుండా ఉన్న సందర్భంలో వైరస్ సోకిన వ్యక్తి శిశువును పెదాలతో ముద్దాడితే ఆ చంటి బిడ్డకూ వైరస్ సోకే అవకాశముంది. ఇలాంటి వైరస్‌లు గానీ ఇన్‌ఫెక్షన్స్ గానీ సోకితే పసికందులు తట్టుకోలేరు. వైరస్‌లు పదేపదే సోకితే పసిపిల్లల్లో తట్టుకునే శక్తి లేక ప్రమాదానికి దారితీయొచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు. వీలున్నంత వరకూ నవజాత శిశువును ముద్దాడటం గానీ, చేతులు కడుక్కోకుండా ఎత్తుకోవడం గానీ చేయొద్దని సూచిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: