
కొందరు సన్నగా, ఆకర్షణీయంగా కనిపించేందుకు బిగుతైన దుస్తులు ధరిస్తారు. జిమ్‌కు వెళ్లేటప్పుడు కూడా బాడీ ఫిట్ దుస్తులను ఎక్కువగా ధరిస్తుంటారు. అయితే ఇవి కొన్ని తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయని నిపుణులు అంటున్నారు. బిగుతుగా ఉన్న దుస్తుల వల్ల చర్మంపై ఒత్తిడి చారలు ఏర్పడతాయి. నడుము, కాళ్ల చుట్టూ వచ్చే ఈ చారలు రక్త ప్రసరణ లోపంతో ఏర్పడతాయి. ఇంకా దీర్ఘకాలంగా ఇలాగే కొనసాగితే వెరికోస్ వెయిన్స్, నాడుల ఒత్తిడి, చర్మ సమస్యలు (డెర్మటైటిస్, దురద) వస్తాయి. బిగుతైన ఇన్నర్స్ ధరిచే మహిళల్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, భుజాలు, మెడ నొప్పులు, బ్రెస్ట్ క్యాన్సర్ ముప్పు పెరుగుతాయి. అంతే కాకుండా పొట్ట చుట్టూ బిగుతుగా ఉన్న దుస్తుల వల్ల ఎసిడిటీ, ఇరిటబుల్ బౌవెల్ సిండ్రోమ్ (IBS) వంటి జీర్ణ సంబంధిత సమస్యలు రావచ్చు. ముఖ్యంగా మహిళల్లో వెజైనల్ ఇన్ఫెక్షన్లు కూడా ఈ కారణంగా తలెత్తే అవకాశముంది.
నిద్ర సమయంలో శరీరానికి విశ్రాంతి అవసరం. అందుకే మృదువైన, తేమను పీల్చుకునే, శ్వాస తీసుకోవటానికి అనుకూలమైన దుస్తులు ధరించాలి. ముఖ్యంగా నడుము, ఛాతీ, కాళ్ల చుట్టూ బిగుతుగా ఉండే దుస్తులు ధరించకుండా ఉండటం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి, బిగుతైన దుస్తులు భౌతిక ఆకర్షణకు అనుకూలంగా అనిపించినా, ఆరోగ్యానికి అవి తీవ్ర విఘాతం కలిగించగలవని గుర్తుంచుకోవాలి. శరీరానికి విశ్రాంతి ఇవ్వడంలో సరైన దుస్తుల ఎంపిక కీలకం.