పశ్చిమ గోదావరి జిల్లాలో టీడీపీకి బలం ఉన్న నియోజకవర్గాల్లో నిడదవోలు నియోజకవర్గం ఒకటి. 2009లో కొత్తగా ఏర్పడిన ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ రెండుసార్లు గెలిచింది. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున బూరుగుపల్లి శేషరావు విజయం సాధించారు. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున పోటీ చేసిన జి. శ్రీనివాస నాయుడు, బూరుగుపల్లిపై విజయం సాధించారు. అయితే శ్రీనివాసనాయుడు మొదట కాంగ్రెస్ లో తన రాజకీయ జీవితం మొదలుపెట్టారు.

 

ఆయన తండ్రి జి‌ఎస్ రావు 1999 ఎన్నికల్లో కొవ్వూరు నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి గెలిచారు. ఇక అమెరికాలో ఉన్నతవిద్యని అభ్యసించి, నిడదవోలుకు వచ్చిన శ్రీనివాసనాయుడు 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోటీ చేసి, బూరుగుపల్లి చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక 2014 ఎన్నికల్లో ఈయనకు నిడదవోలు టికెట్ దక్కలేదు. వైసీపీ తరుపున రాజీవ్ కృష్ణ పోటీ చేసి, బూరుగుపల్లి చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే 2019 ఎన్నికల్లో మళ్ళీ శ్రీనివాసనాయుడు టికెట్ దక్కించుకుని, బూరుగుపల్లిపై 23 వేల మెజారిటీతో గెలిచారు.

 

తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీనివాస్....ప్రజలకు సాధ్యమైన మేర పనులు చేసి పెడుతున్నారు. నియోజకవర్గంలో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ ముందు పలుగ్రామాల్లో సి‌సి రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణాలకు శంఖుస్థాపన చేశారు. అలాగే ప్రభుత్వం నుంచి వచ్చే పథకాన్ని తమ నియోజకవర్గంలో అర్హులైన ప్రజలకు అందిస్తున్నారు. అయితే ఎన్‌ఆర్‌ఐగా వచ్చిన శ్రీనివాస్‌ ఇంకా రాజకీయంగా బలపడినట్లు కనబడటం లేదు.

 

ఏదో జగన్ ఇమేజ్‌తో గెలిచారు గానీ, సొంత ఇమేజ్ మాత్రం తెచ్చుకోలేకపోయారు. ఇదే సమయంలో టీడీపీ సీనియర్ నాయకుడు బూరుగుపల్లి నియోజకవర్గంలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తున్నారు. అలాగే కార్యకర్తలని కలుపుకుని పోతూ, పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. ఇక్కడ జనసేనకు కూడా పర్వాలేదనిపించేలా కేడర్ ఉంది గానీ, సరైన నాయకత్వం లేదు. ఒకవేళ టీడీపీ-జనసేన కలిసి పోటీలో ఉంటే శ్రీనివాస్‌కు ఇబ్బందే. కాకపోతే ఈ రెండు పార్టీలు విడివిడిగా ఉండటం శ్రీనివాస్ నాయుడుకు కలిసొస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకే కాస్త ఎక్కువ స్థానాలు దక్కే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి: