కర్నూలు జిల్లా వైసీపీకి కంచుకోట అనే విషయం తెలిసిందే. అందుకే 2019 ఎన్నికల్లో కర్నూలులో మొత్తం సీట్లు వైసీపీనే గెలిచింది. అయితే ఇక్కడ టీడీపీ చాలా వీక్‌గా ఉంటుంది. ఎన్నికల్లో సున్నా సీట్లు తెచ్చుకుంది. పైగా టీడీపీ నాయకులు భారీ మెజారిటీలతో ఓడిపోయారు. కానీ బనగానపల్లె నియోజకవర్గంలో టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి తక్కువ మెజారిటీతోనే ఓడిపోయారు.

2014లో బీసీ...వైసీపీ నుంచి పోటీ చేసిన కాటసాని రామిరెడ్డిపై గెలిచారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ రివర్స్ అయింది. కాటసాని, బీసీ జనార్ధన్ రెడ్డిపై విజయం సాధించారు. అయితే కాటసాని 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక ఇప్పుడు వైసీపీ నుంచి రెండోసారి ఎమ్మెల్యేగా గెలిచారు. పైగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావడంతో కాటసాని బాగానే పనిచేసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలని ప్రచారం చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టారు. అలాగే నియోజకవర్గంలో ప్రజల సమస్యలని పరిష్కరించడంలో ముందే ఉన్నారు. అదేవిధంగా టీడీపీతో సహ ఇతర పార్టీ కార్యకర్తలని తమ పార్టీలో చేర్చుకుంటూ ముందుకెళుతున్నారు.

అయితే నియోజకవర్గంలో పలు సమస్యలు కూడా ఉన్నాయి. వర్షాలకు రోడ్ల పరిస్తితి మరీ దారుణంగా తయారైంది. రోడ్లని అభివృద్ధి చేయాల్సిన అవసరముంది. అలాగే రాబోయే వేసవికాలంని దృష్టిలో పెట్టుకుని తాగునీటి సమస్య లేకుండా చూసుకోవాల్సిన అవసరముంది. ఇటు రాజకీయంగా కాటసాని బలంగానే ఉన్నారు. అదే సమయంలో టీడీపీ నేత బీసీ జనార్ధన్ రెడ్డి సైతం బలంగా ఉన్నారు.

ఈయనకు పార్టీ బలంతో పాటు సొంత ఇమేజ్ కూడా ఉంది. పైగా గతంలో ఎమ్మెల్యేగా చేసినప్పుడు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందుకే కర్నూలు జిల్లాలో మిగతా టీడీపీ నేతలంతా భారీ మెజారిటీలతో ఓడిపోయిన కూడా బీసీ 13 వేల మెజారిటీతోనే ఓడిపోయారు. అలాగే ఓడిపోయాక కూడా ప్రజల్లోనే ఉంటున్నారు. వారి సమస్యల పరిష్కారానికి నిత్యం కృషి చేస్తున్నారు. అలాగే కార్యకర్తలని కలుపుకునిపోతూ పార్టీని బలోపేతం చేసుకుంటున్నారు. మొత్తానికైతే బనగానపల్లెలో కాటసానికి బీసీ గట్టి పోటీ ఇస్తున్నట్లే కనిపిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: