ఏపీలో అధికార వైసీపీలో సినిమాలు అంటే చెవి కోసుకునే నేతలు చాలా మంది ఉన్నారు. ఇక అధికార పార్టీలోనే సినిమాలు తీసిన నిర్మాతలు కూడా ఉన్నారు. మంత్రి కొడాలి నాని - గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ జూనియర్ ఎన్టీఆర్, రవితేజతో సినిమాలు చేశారు. కొడాలి నాని ఎన్టీఆర్ తో సాంబ, నాని వంశీ కలిసి ఎన్టీఆర్ తో అదుర్స్ సినిమాలు చేశారు. ఇక వల్లభనేని వంశీ రవితేజ హీరోగా టచ్ చేసి చూడు సినిమా తెరకెక్కించారు. కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సైతం ప్రభాస్ హీరోగా యోగి సినిమా నిర్మించారు. ఇలా వైసీపీ వాళ్లకు సినిమా రంగం తో అనుబంధం గట్టిగానే ఉంది.

ఇదిలా ఉంటే టాలీవుడ్లో ఇటీవల రెండు వారాల గ్యాప్‌తో రెండు పెద్ద సినిమాలు వచ్చాయి. ఇందులో బాలయ్య నటించిన అఖండ - బన్నీ నటించిన పుష్ప ఉన్నాయి. ఈ రెండు సినిమాలకు మంచి హిట్ టాక్ వచ్చింది. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు పనిగట్టుకుని ఈ రెండు సినిమాలను చూశారు. కొందరు అయితే హైదరాబాద్ కి వెళ్లి మరి ప్రీమియర్ షోలు చూశారంటే సినిమాలపై ఎంత ఆసక్తి ఉందో తెలుస్తోంది. అయితే విచిత్రం ఏంటంటే బన్నీ నటించిన పుష్ప‌ సినిమా కన్నా బాలయ్య నటించిన అఖండ సినిమా ఎక్కువ మంది వైసీపీ ఎమ్మెల్యేలు, నాయకులు చూశారట.

వాస్తవానికి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న బాలయ్య సినిమాను వైసీపీ నేతలు ఎందుకు చూస్తారు అన్న సందేహం చాలా మందికి ఉంటుంది. పైగా బాలయ్య చంద్రబాబుకు అసెంబ్లీలో తాజాగా జరిగిన సంఘటనల పై వైసీపీ నేతలకు వార్నింగ్ కూడా ఇచ్చారు. అయితే ఇందుకు మరో కారణం కూడా ఉంది. వైసీపీ ఎమ్మెల్యేలు చాలామంది బాలయ్యకు స్వతహాగా వీరాభిమానులు.

పార్టీలు... రాజకీయాలతో సంబంధం లేకుండా బాలయ్య సినిమాలను వారు ఇష్టపడతారు. పైగా అఖండ సినిమా చూసిన ఉత్తరాంధ్ర, విజయవాడకు చెందిన ఇద్దరు మంత్రులు సైతం డైలాగులు బాగున్నాయి అని కితాబు ఇవ్వటం విశేషం. ఇక బన్నీ నటించిన పుష్ప సినిమాను సైతం మరో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వైసీపీ నేతలు ఎక్కువగా చూశారట.

 

మరింత సమాచారం తెలుసుకోండి: