నిన్న జరిగిన వైకుంఠ ఏకాదశి మన ఇరు రాష్ట్రాలలోని ఆలయాలలో అత్యంత కన్నుల పండుగగా జరిగింది. భద్రాచలంలో సీతరామచంద్రస్వామివారు.. భక్తులకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం ఇచ్చారు. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఇదే పరిస్థితి మన ఇరు రాష్ట్రాలలోను కనిపించింది. ముక్కోటి నాడు వైకుంఠ ద్వారాలను తెరుస్తారనీ దక్షిణాయన కాలంలో ఇప్పటి వరకు చని పోయిన వారంతా ఇప్పుడు పరమ పదంలోకి ప్రవేశిస్తారని మన పెద్దలు చెపుతూ ఉంటారు.  తెల్ల వారు ఝామునపూజాదికాలు  అయిన తర్వాత ఉత్తర ద్వారం నుండి భక్తులు గుడిలోకి ప్రవేసించి దేవుడుని దర్శించుకుంటారు. ఈ ఉత్తర ద్వారంలోంచి వెళ్లి దేవుడుని దర్శించుకోవడం మోక్షానికి దారి అని మన నమ్మకం.

కలియుగ వైకుంఠం గా పిలవబడే తమిళ నాడులోని శ్రీరంగంలో మహా వైభవంగా ఈ వేడుకలు జరిగాయి.  అంతేకాదు తిరుమలలోను భద్రాచలంలోను విశేషంగా ఈరోజు పూజలు జరగడమే కాకుండా లక్షలాది సంఖ్యలో మన తెలుగు రాష్ట్రాలలోని అన్ని ఆలయాలు భక్తులతో నిండిపోయాయి. మన హిందూ ధర్మ శాస్త్ర ప్రకార 24 ఎకాదశులు వున్నాయి.  ఆకాశం లోని విష్ణు నక్షత్ర గమనాన్ని ఇవి తెలియ జేస్తాయి.

ఏకాదశి రోజున విష్ణువు నిద్ర నుంచి మేల్కొంటాడు అని మన పురాణాలు చెపుతున్నాయి. దీనితో చాతుర్మాస  దీక్ష పూర్తి అయి యతులు మళ్ళీ ప్రయాణాలు మొదలు పెడతారు. కలియుగవైకుంఠo అయిన తిరుమలలో వైకుంఠ ఏకాదశి నాడు ఉత్తరద్వారం గుండా ప్రవేశించి శ్రీ వేంకటేశ్వరుని దర్శించి తరించడానికి లక్షలాది భక్తులు దర్శించుకున్నారు. 

దేవతలకు ఆరు నెలలు పగలు, ఆరు నెలలు రాత్రి అంటారు. రాత్రిని దక్షిణాయనం, పగటిని ఉత్తరాయణం అంటారు. దక్షిణాయనం వెళుతుండగా చీకటి తొలగి సూర్యుడు ఉదయించినట్లుగా  దేవతలకు కూడ చీకటి తొలిగి వెలుతురు వస్తుంది.  ఈ వైకుంఠ ద్వారమన్నది సూర్యుని ఉత్తరాయణ ప్రవేశ చిహ్నముగా చెప్పుకుంటాము. ముక్కోటి దేవతలు ఈనాడు ఉత్తరమందున్న శ్రీ మహా విష్ణువును దర్శించుకుంటారు. అందుచే ప్రాతఃకాలంలో భక్తులుకూడా ముక్కోటి దేవతలతో కూడివున్న వైకుంఠుణ్ణి ఉత్తర ద్వార దర్శనం చేసుకుని ముక్తి పొందాలని భావిస్తారు. అందుకే దీన్ని మోక్ష ఏకాదశి అని కూడా అంటారు.

మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడుకోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు అని నమ్మకం. ఈ ఒక్క ఏకాదశి మూడుకోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ‘ముక్కోటి ఏకాదశి’ అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాబారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.

వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు జరిగాయి. నిన్నటిరోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం ఈ రోజున ఉపవాసం ఉన్న వారి పాపాలు హరించి పోతాయని అంటారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అని విష్ణుపురాణం చెబుతోంది. ఇలా ఎన్నో పురాణాల  కథలు ఈ పండుగకు సంబంధించి ఉన్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: