సాహో సినిమాకు దాదాపు అన్ని పత్రికలు, వెబ్ సైట్లతో పాటు సోషల్ మీడియాలోనూ నెగిటివ్ రివ్యూలే వచ్చాయి. అయితే ఈ సినిమాకు తాజాగా ప్రముఖ వెబ్ సైట్ బీబీసీ కూడా తన తెలుగు వెబ్ సైట్ లో రివ్యూ ఉంచింది. సాహో ఎక్కడ ఫెయిలైంది అనే అంశాలను చక్కగా విశ్లేషించింది.


కథను అనేక మలుపులు తిప్పి ప్రేక్షకులను కట్టి పడెయ్యాలనుకున్న సాహో సినిమా, తను వేసుకున్న ముళ్లల్లో తానే చిక్కుకుని బోర్లా పడిపోయిందని సింపుల్ గా బీబీసీ తేల్చేసింది. ఈ సినిమాను మరీ అంతగా నవ్వులపాలు చేయడంలో ముఖ్యపాత్రను పోషించినవి మాత్రం స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ లేనని బీబీసీ అభిప్రాయపడింది. .


ఈ సినిమా దర్శకుడు.. అక్కడో ఇక్కడో తడబడ్డాడని చెప్పే వీల్లేకుండా, ఎక్కడికక్కడే అర్థం కానంత గందరగోళాన్ని సృష్టించాడని తెలిపింది బీబీసీ. అనేక కాలగమనాలు లేకపోయినా, గతంలోకి, వర్తమానంలోకీ గెంతకపోయినా, క్లిష్టమైన కథాంశం కాకపోయినా, తెర మీద ఏం జరుగుతోందో తెలుసుకోవడం చాలా కష్టమైపోయేలా చేసింది ఈ సినిమాకు చెందిన అర్థరహితమైన కథన శైలి అంటూ తూర్పారబట్టేసింది.


సినిమాలో అసలేం జరిగిందో చూస్తే, గుర్తుపెట్టుకునేంత సమయమైనా ఇవ్వకుండా అనేకమైన ముఖాలూ, భాషలూ, ప్రాంతాలూ, సంఘటనలూ ఒకదానివెంట ఒకటి, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా తెర మీద కదిలిపోతుంటాయని సమీక్షకుడు అభిప్రాయపడ్డాడడని బీబీసీ తెలిపింది.


ఇక ఈ సినిమాలో మరో మైనస్ పాయింట్ ను బీబీసీ ఇలా చెప్పింది.. సినిమాలో అనేకమంది ప్రముఖ నటులు సినిమా నిండా కనిపించినప్పటికీ, ఎవరి పాత్రా ఒక నిర్దిష్టమైన రూపాన్ని సంతరించుకోలేకపోయింది. మొత్తంగా చూస్తే ఈ సినిమా, జీవంలేని మరబొమ్మలా యాంత్రికమైన కదిలికలను చూసిన ఫీల్‌ను మనసు మీద ముద్రించగలిగిందని... ఎంతటి నిపుణులైన ఎడిటర్లనూ, ఇతర టెక్నీషియన్‌లనూ తీసుకొచ్చినా వారి ప్రతిభను సరైన రీతిలో వినియోగించుకోలేకపోతే సినిమా ఎలా విఫలమవుతుందన్నదానికి సాహో సినిమానే ఉదాహరణ అంటూ తన రివ్యూను ముగించింది బీబీసీ.


మరింత సమాచారం తెలుసుకోండి: