మహిళ అంటే విలువైన మణి లాంటి మనసు ఉన్న వ్యక్తిత్వం. పేగు తెంచి బిడ్డకు ప్రాణం పోసినప్పుడు తల్లిగా భుజం తట్టి గెలిపించే సోదరిగా తనువు ఇచ్చి జీవితాంతం భర్త వెనువెంట నడిచే భార్య గా మహిళ ఎన్నో పాత్రలను బాధ్యతలను సమర్థవంతంగా పోషిస్తూనే ఉంది. 


‘ఏవిషయంలోనైనా పురుషులకి పోటీగా మహిళలు రాణించగలరు మానసిక సామర్థ్యం వారికి అదనపు బహుమతి’ అంటూ మహాత్మాగాంధీ మహిళల గొప్పతనం గురించి అనేక సార్లు ప్రస్తావించారు. దాదాపు శతాబ్దానికి ముందు నుంచే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రజలు మార్చి 8వ తేదీని మహిళలకు ప్రత్యేక రోజుగా గుర్తిస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం కార్మిక ఉద్యమం నుంచి పుట్టుకొచ్చింది. దీనిని ఐక్యరాజ్య సమితి గుర్తించి ప్రతి ఏటా నిర్వహిస్తోంది. ఈ ఉద్యమానికి బీజాలు 1908 లో పడ్డాయి. తక్కువ పని గంటలు మెరుగైన జీతం ఓటు వేసే హక్కు కోసం న్యూయార్క్ సిటీలో 15 వేల మంది మహిళలు ప్రదర్శన చేశారు. 


ఈ మహిళల డిమాండ్లను దృష్టిలో పెట్టుకుని అమెరికాలోని సోషలిస్టు పార్టీ 1909వ సంవత్సరంలో జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రకటించింది. ఈ దినోత్సవాన్ని అంతర్జాతీయ స్థాయిలో నిర్వహించాలన్న ఆలోచన క్లారా జెట్కిన్ అనే ఒక మహిళది అన్న విషయం చాల తక్కువందికి తెలిసిన నిజం. 1910లో జరిగిన 'ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ వర్కింగ్ ఉమెన్‌' సదస్సులో ఆమె ఈ ప్రతిపాదన చేశారు. 17 దేశాల నుంచి ఈ సదస్సుకు హాజరైన 100 మంది మహిళలు క్లారా జెట్కిన్ ప్రతిపాదనను ఏకగ్రీవంగా అంగీకరించారు అని అప్పటి చరిత్ర చెపుతోంది. 


ఈ ఏడాది జరిగే ఈ మహిళా దినోత్సవం 108వ అంతర్జాతీయ మహిళా దినోత్సవం. భారతదేశంలో మహిళలు ఎంతో అభివృద్ధి పదంలో పయనిస్తున్నారు అంటూ మనం ఈరోజు మహిళా దినోత్సవాన్ని ఎంతో గొప్పగా జరుపుకుంటున్నా మహిళల ఆరోగ్య విషయంలో విద్య విషయంలో ఆర్ధిక పరమైన విషయాలలో ఇప్పటికీ భారతదేశ మహిళల స్థానం ప్రపంచ దేశాలలో మహిళలతో పోల్చుకుంటే ఇప్పటికీ చాల అట్టడుగు స్థాయిలోనే కొనసాగుతున్నాం. మనదేశంలో ఆర్ధిక వ్యాపార రక్షణ విద్య క్రీడ రాజకీయ రాజకీయ సాహిత్య సంగీత కళా రంగాలలో మహిళలు ఎంతో ఉన్నత స్థానంలో కొనసాగుతున్నా ఇప్పటికీ మన దేశంలో సగటున 5 నిముషాలకు దేశంలో ఎక్కడో అక్కడ స్త్రీల పై అత్యాచార సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ మన దేశంలో అమ్మాయి పుట్టింది అంటే బాధపడే కోట్లాది ప్రజలు ఉన్న పరిస్థితులలో ప్రస్తుతం 1000 మంది అబ్బాయిలకు 833 మంది బాలకలు మాత్రమే ఉన్నారు అంటూ జనాభా లెక్కలు చెపుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 100 సంవత్సరాలు తరువాత అబ్బాయిలతో  అమ్మాయిల నిష్పత్తి మరింతగా తగ్గిపోతుందని హెచ్చరికలు వస్తున్నాయి. 


స్త్రీ మేధాపరంగా మానసికంగా ఆధ్యాత్మికంగా పురుషుడు కంటే ఎక్కువ అన్న సత్యాన్ని తెలిసి కూడ గుర్తించలేని విచిత్ర పరిస్థితులలో నేటి మహిళ ప్రస్థానం కొనసాగుతోంది. యాధృశ్చికంగా ఇదే మహిళా దినోత్సవం రోజున జరుగుతున్న ప్రపంచ మహిళల ‘టి 20’ కికెట్ ప్రపంచ కప్ ఫైనల్స్ జరుగుతూ ఉండటం భారతీయ మహిళా శక్తికి గర్వకారణం. ఈరోజు భారతదేశంలోని ప్రతి మహిళ గర్వించే విధంగా మిధాలీరాజ్ నేతృత్వంలోని భారత్ మహిళా క్రికెట్ టీమ్ విజయం సాధించి ఇండియాకు ప్రపంచ కప్ తీసుకురావాలని అందరం కోరుకుంటూ మహిళలు అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు..

మరింత సమాచారం తెలుసుకోండి: