ఇప్పటికే ఈ మహమ్మారి కరోనా దెబ్బకు ప్రపంచ దేశాలన్నీ కూడా కొన్ని వారాల పాటు ఎక్కడి ప్రజలను అక్కడే తమ తమ ఇళ్లకు పూర్తిగా పరిమితం చేస్తూ లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక మన దేశాన్ని కూడా మే 3 వరకు పూర్తిగా లాక్ డౌన్ చేస్తున్నట్లు ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయితే గత మూడు వారాలుగా ఈ లాక్ డౌన్ మన దేశంలో అమలు అవుతుండడంతో ఇప్పటికే చాలా రంగాలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఓ వైపు ప్రజలు బయటకు రాలేక, తినడానికి తిండి లేక నానా అవస్థలు పడుతుండడం, మరోవైపు పలు కంపెనీలు, సంస్థలు, కార్యాలయాలు, వ్యాపారాలు కలవారు, తమ భారాన్ని తగ్గించుకునేందుకు అప్పుడే కొందరు ఉద్యోగులను తొలగించగా, మరికొందరు కూడా అదే బాటలో నడిచేందుకు సిద్ధం అవుతున్నారు. 

 

ఇక ఈ లాక్ డౌన్ వలన ముఖ్యంగా సినిమా రంగం కూడా ఎంతో భారీగానే నష్టపోయే పరిస్థితికి వచ్చినట్లు చెప్తున్నారు విశ్లేషకులు. ఇప్పటికే దాదాపుగా 25 రోజులకు పైగా షూటింగ్స్ నిలిచిపోయాయని, దానితో టాలీవుడ్ లో చాలా మంది నిర్మాతల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా ఓవైపు వారు తెచ్చిన అప్పులకు వడ్డీ కట్టే సమస్య ఒకటైతే, మరోవైపు కోట్ల రూపాయలు వెచ్చించి సిద్ధం చేసిన పలు సినిమాల సెట్టింగులు, ఆర్టిస్టుల కాల్షీట్స్ వేస్ట్ అవడం వంటివి జరుగుతున్నాయని, అలానే ముందుగా అనుకున్న విధంగా రిలీజ్ అవ్వాల్సిన సినిమాలు చాలా ముందుకు ముందుకు జరపాల్సిన పరిస్థితులు తలెత్తాయని అంటున్నారు. 

 

ఈ లాక్ డౌన్ ఎప్పుడు ముగుస్తుందో అర్ధం కావడం లేదని, ఒకవేళ ముగిసినప్పటికీ, ఆ తరువాత సినిమాల షూటింగ్ లకు ఎంత మేర ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుందో తెలియడం లేదని, అలానే దేశం దాటి వెళ్లే పరిస్థితులు కూడా ఉండకపోవచ్చు కాబట్టి, ఇప్పటివరకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్న పలు సినిమా యూనిట్లు ఇకపై కొత్తగా ఎక్కడైనా స్టూడియోలో సెట్స్ వేయడం, లేదా దగ్గర్లో ఎక్కడైనా అందుబాటు ఉన్న ఏరియాల్లో షూటింగ్స్ చేయడం వంటివి చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయని అంటున్నారు. ఇటువంటివన్నీ ముఖ్యంగా సినిమాల ప్రొడక్షన్ కాస్ట్ పై చాలా ప్రభావం చూపుతాయని, దీనివలన కొన్ని వందల కోట్లరూపాయలు నష్టం రానున్నట్లు చెపుతున్నారు. ఇక మొత్తంగా ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తుంటే ఈ కరోనా వలన టాలీవుడ్ కి పడింది అలాంటిలాంటి దెబ్బ కాదని, నిజంగా చావు దెబ్బె అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!   

 

మరింత సమాచారం తెలుసుకోండి: