ముంబై డ్రగ్స్ కేసులో నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో దూకుడు పెంచింది. కేసుతో సంబంధాలున్న బాలీవుడ్‌ స్టార్‌లకు నోటీసులు జారీ చేసింది. రకుల్‌ ప్రీత్‌ సింగ్, దీపికా పదుకొణే, శ్రద్ధాకపూర్, సారా అలీఖాన్‌లకు సమన్లు ఇచ్చింది. మూడు రోజుల్లో ఎన్సీబీ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కోంది ఎన్‌సీబీ.

బాలీవుడ్‌ డ్రగ్స్ కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య కేసులో డ్రగ్స్‌ కోణం బయటపడటంతో రంగంలోకి దిగిన ఎన్సీబీ.. ఈ అంశంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తోంది. దీంతో విచారణలో  కొత్త పేర్లు బయటకొస్తున్నాయి. దీపికా పదుకొణె, సారా అలీఖాన్‌, శ్రద్ధా కపూర్‌, రకుల్‌ప్రీత్ సింగ్‌కు సమన్లు జారీ చేశారు ఎన్సీబీ అధికారులు. మూడు రోజుల్లో డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ ఆదేశించింది. టాలీవుడ్‌ స్టార్ హీరోయిన్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌..  రేపు ఎన్సీబీ ముందు విచారణకు హాజరుకానుంది. మరోవైపు గోవాలో షూటింగ్‌లో ఉన్న దీపికా.. తాజా పరిస్థితిపై 12 మంది లాయర్ల బృందంతో టెలీకాన్ఫరెన్స్‌లో చర్చించింది.

రియా వాట్సాప్ చాట్‌ను రిట్రైవ్ చేయగా... అందులో డ్రగ్స్  సప్లైకి సంబంధించి కీలక సమాచారం బయటపడింది. దీని ఆధారంగానే నిన్న దీపిక పదుకొనే మేనేజర్ కరిష్మా ప్రకాష్, టాలెంట్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ జయ సాహా, సుశాంత్ మేనేజర్ శృతి మోడీకి ఎన్సీబీ సమన్లు జారీచేసింది. వీరిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించింది. దీంతో  దీపికా పదుకొణే, సారా ఆలీఖాన్‌, శ్రద్ధాకపూర్‌, రకుల్ ప్రీత్‌సింగ్‌ పేర్లు బయటకు వచ్చాయి.
 
దీపికా పదుకునే మేనేజర్‌  కరిష్మా ప్రకాష్‌కు డ్రగ్స్ లింకులు బయటపడటంతో దీపికా పదుకొనే కూడా డ్రగ్స్‌ తీసుకుందనే ప్రచారం జరుగుతోంది.  శ్రద్ధా కపూర్‌ జయ సాహతో  చేసిన చాట్‌ లీకయ్యింది. సీబీడీ ఆయిల్‌తో కలిపి జినాల్‌ పంపిస్తున్నానని జయ చెప్పగా... హే థాంక్యూ.. అంటూ రిప్లై ఇచ్చింది శ్రద్ధ. మరోవైపు టాలెంట్ ఏజెన్సీ ఎగ్జిక్యూటివ్ జయా సాహా... చాటింగ్‌పైన దృష్టిపెట్టిన ఎన్‌సీబీ... డ్రగ్స్‌ చైయిన్‌లో ఎవరెవరున్నారో ఆరా తీస్తోంది.

డ్రగ్స్‌ కేసు ఇప్పుడు బాలీవుడ్‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.  ఇప్పటి వరకూ అరెస్టయిన వారిని విచారిస్తున్న సమయంలో కొత్త పేర్లు బయటికి వస్తున్నాయి. ఇంకా ఎన్ని పేర్లు బయటకు వస్తాయో అని చాలామంది సినీనటుల్లో ఆందోళన కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: