ఇంటర్నెట్ డెస్క్: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఓ వీరాభిమానికి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఈ గిఫ్ట్‌ను అల్లుఅర్జున్ కుమారుడు అయాన్ స్వయంగా తన చేతులతో ఆ అభిమానికి అందించాడు. ఇంతకీ ఆ వీరాభిమాని ఎవరో తెలుసా..? ఓ అనాథాశ్రమంలో ఉండే చిన్నారి. క్రిస్మస్ రోజున ఊహించని ఈ గిఫ్ట్ అందడం, అది కూడా తన అభిమాన నటుడి నుంచి అందడంతో ఆ బుజ్జి అభిమాని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.

హైదరాబాద్‌లోని ఓ అనాథ ఆశ్రమంలో అల్లు అర్జున్‌ అభిమాని అయిన ఓ పిల్లాడున్నాడు. తనకు బన్నీ ఆటోగ్రాఫ్‌ తీసుకోవాలని కోరిక. విషయాన్ని తెలుసుకున్న బన్నీ చిన్నారి అభిమానికి సర్‌ప్రైజ్ ఇచ్చారు. తనయుడు అల్లు అయాన్‌ ద్వారా సదరు చిన్నారి అభిమానికి తన ఆటోగ్రాఫ్‌ను పంపడమే కాకుండా.. అక్కడున్న మిగతా పిల్లలందరికీ కూడా బహుమతులను పంపి సర్‌ప్రైజ్‌ ఇచ్చారు.

అయితే ఈ అభిమాని గురించి అల్లు అర్జున్‌కు బిగ్‌బాస్‌ ఫేమ్‌ వితిక షేరు ద్వారా తెలిసిందట. దీంతో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా తన ఆటోగ్రాఫ్‌ను, గిఫ్ట్‌లను పంపించాడు మన స్టైలిష్ స్టార్. వీటిని ఆ ఆశ్రమంలోని చిన్నారులకు అందించిన అయాన్.. వారితో కలిసిపోయి ఆడుకున్నాడు. ఆశ్రమంలోని బాలబాలికలు ఉత్సాహంతో కేరింతలు కొట్టారు. ‘థ్యాంక్యూ బన్నీ అన్నా’ అంటూ తమ అభిమాన హీరోకు ధన్యవాదాలు తెలిపారు. మెర్రీ క్రిస్మస్‌ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇదిలా ఉంటే బన్నీ తనయురాలు అర్హ, తనయుడు అయాన్‌ ఇద్దరూ సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తుంటారు. ఫాలోయింగ్‌లో తండ్రి అల్లు అర్జున్‌తోనే పోటీపడుతుంటారు. తాజాగా క్రిస్మస్ ట్రీని డెకరేట్ చేసి మురిసిపోతున్న కూతురు అర్హ ఫోటోలను అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన కొన్ని నిముషాల్లోనే లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: