2007లో చిరుత సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యారు మెగాస్టార్ వారసుడు కొణిదెల రామ్ చరణ్ తేజ్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకున్న చెర్రీ ఆ తర్వాత వెనుదిరిగి చూసింది లేదు. మగధీర సినిమాతో చరిత్రను తిరగ రాశారు ఈ యంగ్ హీరో. చిరు తనయుడిగా సినీ తెరంగ్రేటం సులువుగానే లభించినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని అగ్రహీరో స్థాయికి ఎదిగారు రామ్ చరణ్. ‘చిరుత’ విడుదలై ఇప్పటికి 13ఏళ్లు పూర్తి అయింది. ఇన్నేళ్ల తన సినీ జీవితంలో అద్భుతమైన విజయాలతో పాటు అపజయాలను కూడా చవి చూశారు.

బ్లాక్ బస్టర్ లభించినప్పుడు పొంగిపోవడం.. ప్లాప్ అయినప్పుడు కృంగిపోవడం రెండిటినీ చేయకుండా అన్నింటినీ ఆనందంగా ఆహ్వానిస్తారు చెర్రీ. తను చేసే పాత్రలో లీనమై న్యాయం చేయగల ధీరుడు. అటు తండ్రి లోని గాంభీర్యం, మైమరిపించే నటన, అబ్బురపరిచే డాన్స్ స్టెప్పులు.... ఇటు బాబాయ్ పవన్ కళ్యాణ్ యాక్టింగ్ లోని పవర్, స్టైల్, డైలాగ్ డెలివరీ... మాటల్లోని చలాకీతనం కలగలిపిన మెగా ఇంటి వారసుడు రామ్ చరణ్ తేజ్ కు మెగా పవర్ స్టార్ అంటూ నీరాజనాలు పలికారు అభిమానులు. ఒకవైపు హీరోగా రాణిస్తూనే..  'ఖైదీ 150' మరియు ‘సైరా నరసింహారెడ్డి’ సినిమాలతో నిర్మాతగా మారారు చరణ్.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ఆర్.ఆర్.ఆర్  పీరియాడికల్ మూవీతో బిజీగా ఉన్నారు. తదుపరి తండ్రి సినిమా ఆచార్యలో అతిధి పాత్రలో కనిపించనున్న విషయం తెలిసిందే. అయితే 2021లో ఈ రెండు సినిమాలతో అభిమానులకు డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు చెర్రీ. ఇప్పటివరకు గడిచిన తన సినీ జీవితంలో ఒకే సంవత్సరం రెండు సినిమాలు విడుదల అయింది లేదు. దీనితో ప్రేక్షకులు పుల్ ఖుషీ అవుతున్నారు. ఆచార్య’ సినిమా మాత్రం మే 9న విడుదల కానుంది. 'ఆర్ఆర్ఆర్’ రౌద్రం రణం రుధిరం’ సినిమాను ఈ యేడాది అక్టోబర్ 13న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు మేకర్స్. ఇలా ఈ రెండు సినిమాలతో 2021లో సందడి చేయనున్నారు   రామ్ చరణ్ తేజ్.

మరింత సమాచారం తెలుసుకోండి: