ఇండియాలో టాప్ ఓటీటీ ప్లాట్ ఫామ్ గా పేరు గాంచిన నెట్ ఫ్లిక్స్ కన్ను ఇప్పుడు టాలీవుడ్ పై పడింది. కేవలం కొత్త సినిమాలను స్ట్రీమింగ్ చేయడమే కాకుండా వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలు, స్ట్రైట్ మూవీస్ ని నిర్మిస్తూ డిఫరెంట్ కంటెంట్ ని ఆడియన్స్ కి అందిస్తూ వస్తోంది నెట్ ఫ్లిక్స్. గత కొంతకాలంగా బాలీవుడ్ స్టార్స్ తో కలిసి సినిమాలు, వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ వచ్చిన నిర్వాహకులు ఇప్పుడు టాలీవుడ్ స్టార్స్ తో పరిచయాలు పెంచుకునే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ గత మూడు రోజులుగా హైదరాబాద్లో పర్యటిస్తున్నారు. ఆయనతోపాటు టీం మోనికా షెర్గిల్ తదితరులు ఉన్నారు.

 ట్విన్ సిటీలో పర్యటిస్తున్న సందర్భంగా సరండోస్ టాలీవుడ్ టాప్ హీరోలందరినీ ప్రత్యేకంగా కలుస్తున్నారు. మొదట మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇంట్లో భేటీ అయ్యారు. చిరంజీవి, రామ్ చరణ్, సాయి తేజ్, వైష్ణవ్ తేజ్ వారికి వెల్కమ్ చెప్పారు. అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మెగా హీరోలను కలిసిన అనంతరం నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ని కూడా కలిశారు. తారక్ తో పాటు కళ్యాణ్ రామ్, కొరటాల శివ కూడా అక్కడే ఉండడం విశేషం. ఆ తర్వాత మహేష్ బాబుతో భేటీ అయ్యారు. ఈ భేటీలో మహేష్ తో పాటు త్రివిక్రమ్, నిర్మాత నాగ వంశీ పాల్గొన్నారు. మహేష్ తర్వాత దగ్గుబాటి ఫ్యామిలీని కలిశారు.

 ఆ తర్వాత అల్లు అర్జున్ ని మీట్ అయ్యారు. ఇక తాజాగా పాన్ ఇండియా హీరో ప్రభాస్ ని సైతం కలిశారు. కల్కి మూవీ సెట్స్ లో వీరి కలయిక జరిగినట్టు తెలుస్తోంది. అందుకు సంబంధించిన ఫోటో కూడా బయటికి వచ్చింది. ఈ ఫోటోలో ప్రభాస్ తో పాటు నాగ్ అశ్విన్, ప్రియాంక దత్, స్వప్న దత్ ఉన్నారు. ఇలా టాలీవుడ్ స్టార్స్ అందరినీ కలిసిన నెట్ ఫ్లిక్స్ CEO టెడ్ సరండోస్ ఈ సందర్భంగా తన ఆనందాన్ని పంచుకున్నారు." నేను గత మూడు రోజులుగా తెలుగు సినిమా లెజెండ్స్ ని కలుసుకున్నాను. వారి కథలు క్రాఫ్ట్ పట్ల వాళ్లకున్న అంకిత భావం చూసి ఆశ్చర్యపోయాను. జీవితంలో ఒక్కసారి అయినా ఇది అనుభవించినందుకు ధన్యవాదాలు. మళ్లీ తిరిగి రావడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా" అంటూ పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: