బెల్లంకొండ శ్రీనివాస్‌.. టాలీవుడ్‌లో ఈయన ఓ మీడియం రేంజ్‌ హీరో. తెలుగులో ఈయన సినిమాలపై పెద్దగా అంచనాలేమీ ఉండవు. కానీ బాలీవుడ్‌లో అలా కాదు.ఈయన సినిమా వచ్చిందంటే హిందీ ఆడియన్స్‌ ఎగబడి చూస్తుంటారు. తెలుగులో ఫ్లాప్‌ అయిన సినిమాలు కూడా అక్కడ సంచలనాలు సృష్టిస్తుంటాయి. టీవీలు, యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌ను సొంతం చేసుకుంటాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన ఒక సినిమా యూట్యూబ్‌లో అరుదైన రికార్డు సృష్టించింది. 800 మిలియన్‌ వ్యూస్‌తో ఇండియాలోనే అత్యధిక మంది వీక్షించిన చిత్రంగా నిలిచింది. అది కూడా డిజాస్టర్‌గా నిలిచి.. ట్రోలర్స్‌ బారిన పడిన సినిమా కావడం గమనార్హం. ఇంతకీ ఆ సినిమా ఏంటని అనుకుంటున్నారా? బోయపాటి శ్రీనివాస్‌ దర్శకత్వంలో వచ్చిన జయ జానకీ నాయక.!
బెల్లంకొండ శ్రీనివాస్, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన బోయపాటి శ్రీనివాస్‌ దర్శకత్వంలో జయ జానకీ నాయక సినిమా 2017 ఆగస్టులో విడుదలైంది. అప్పుడు ఈ సినిమాకు మిక్స్‌డ్‌ టాక్‌ వచ్చింది. ఇందులో సాంగ్స్‌, ఫైట్స్‌పై అప్పట్లో ఓ రేంజ్‌లో ట్రోల్స్‌ కూడా వచ్చాయి. దీంతో బాక్సాఫీస్‌ దగ్గర ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఆడియన్స్‌ కూడా ఈ సినిమాను పెద్దగా గుర్తుంచుకోలేదు. కానీ యాక్షన్‌ మూవీస్‌ను ఇష్టపడే నార్త్‌ ఆడియన్స్‌ మాత్రం ఈ సినిమాకు పిచ్చపిచ్చగా కనెక్ట్‌ అయిపోయారు. బెల్లంకొండ శ్రీనివాస్‌కు బాలీవుడ్‌లో ఉన్న ఆదరణ దృష్ట్యా.. పెన్‌ మూవీ సంస్థ ఈ సినిమాను హిందీలోకి డబ్‌ చేసి విడుదల చేస్తే.. ఈ సినిమాకు నీరాజనం పట్టారు. జయ జానకీ నాయక ఖూంఖార్‌పేరుతో 2019లో హిందీలోకి అనువాదమైన ఈ మూవీ అనూహ్యంగా 800 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. అలా యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ సాధించిన ఇండియన్‌ సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని సినిమా డబ్బింగ్‌ రైట్స్‌ సొంతం చేసుకున్న పెన్‌ స్టూడియోస్‌ అధికారికంగా ప్రకటించింది.ఇక జయ జానకీ నాయక సినిమా తర్వాత రెండో స్థానంలో ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యశ్‌ నటించిన కేజీఎఫ్‌ సినిమా ఉంది. ఈ సినిమా 772 మిలియన్‌ వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఇక మూడో స్థానంలో నిలిచిన సినిమా కూడా బెల్లంకొండదే కావడం విశేషం. తేజ దర్శకత్వంలో ఆయన నటించిన సీత సినిమా.. సీతారామ్‌ పేరిట హిందీలోకి అనువాదమైతే 643 మిలియన్‌ వ్యూస్‌ సొంతం చేసుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: