
సినిమా పరిశ్రమలోకి ప్రవేశించడానికి ముందు ఏపీ మరియు కర్ణాటకలో బ్యాడ్మింటన్ ప్లేయర్ గా సుధీర్ బాబు రాణించారు. ప్రముఖ కోచ్ పుల్లెల గోపిచంద్ తో కలిసి అప్పట్లో డబుల్స్ ఆడిన అనుభవం కూడా సుధీర్ బాబుకు ఉంది. 2006లో సూపర్ స్టార్ కృష్ణ కుమార్తె, మహేష్ బాబు సోదరి ప్రియదర్శినితో సుధీర్ బాబుకు వివాహం జరిగింది. ఘట్టమనేని ఇంటికి అల్లుడైన కొన్నేళ్లకే సుధీర్ బాబు సినీ ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. 2010లో వచ్చిన `యే మాయ చేసావే` చిత్రంతో యాక్టింగ్ కెరీర్ ను ప్రారంభించారు.
`శివ మనసులో శ్రుతి`తో సుధీర్ బాబు హీరోగా మారారు. 2013లో వచ్చిన `ప్రేమ కథా చిత్రం`తో ఆయనకు బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంపిక చేసుకుంటూ ప్రేక్షకులను అలరించారు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో సుధీర్ బాబు క్రేజీ హీరోగా గుర్తింపు పొందారు. గత ఏడాది `హరోం హర`, `మా నాన్న సూపర్ హీరో` వంటి సినిమాలో పలకరించిన సుధీర్ బాబు.. ప్రస్తుతం `జటాధార`, `మాయదారి మల్లిగాడు` వంటి చిత్రాల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు ప్రాజెక్ట్స్ ఇప్పుడు చిత్రీకరణ దశలోనే ఉన్నాయి. కాగా, సుధీర్ బాబు-ప్రియదర్శిని దంపతులకు చరితమానస్, దర్శన్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరిలో చరితమానస్ ఇప్పటికే చైల్డ్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాలు చేశాడు. భవిష్యత్తులో తండ్రి బాటలోనే హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు శిక్షణ కూడా తీసుకుంటున్నాడు.