ఈ తరం ప్రేక్షకులు బాలకృష్ణ, చిరంజీవి మధ్య సాగుతున్న బాక్సాఫీస్ వార్ గురించి ముచ్చటించుకుంటూ 'ఆహా.. పోటీ అంటే ఇది కదా..' అంటున్నారు. ఈ ఇద్దరు మాస్ హీరోలకు ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు. అయితే అప్పట్లో ఆల్ రౌండర్ గా సాగుతున్న నటరత్న నందమూరి తారక రామారావు, సాంఘిక చిత్రాలలో తనదైన బాణీ పలికిస్తున్న నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు మధ్య మరింత విశేషమైన పోటీ ఉండేది. అభిమానులు వారిద్దరినీ దైవాంశసంభూతులుగా భావిస్తున్న రోజులవి. అలాంటి ఇద్దరూ కలసి నటించిన చిత్రాలు సైతం తెలుగువారిని విశేషంగా అలరించాయి. యన్టీఆర్, ఏయన్నార్ కలసి కేవీ రెడ్డి దర్శకత్వంలో శ్రీకృష్ణార్జునులుగా నటించిన 'శ్రీకృష్ణార్జున యుద్ధము' 1963 జనవరి 9న విడుదలై విజయఢంకా మోగించింది.


శ్రీమద్భాగవతంలో 'గయోపాఖ్యానము' ప్రసిద్ధమైనది. అది తెలుగునేలపై నాటకంగానూ బహుళ ప్రచారం పొందింది. ఆ ఇతివృత్తాన్ని తీసుకొని సినిమాకు అనువుగా పింగళి నాగేంద్రరావుతో రచన చేయించారు కేవీ రెడ్డి.
ఈ సినిమాలో సుభద్రగా బి. సరోజాదేవి, రుక్మిణిగా జూనియర్ శ్రీరంజని, సత్యభామగా యస్.వరలక్ష్మి, నారదునిగా కాంతారావు, బలరామునిగా మిక్కిలినేని, గయునిగా ధూళిపాల, ధర్మరాజుగా గుమ్మడి నటించగా, మిగిలిన పాత్రల్లో అల్లు రామలింగయ్య, మహంకాళి వెంకయ్య, నాగయ్య, ముక్కామల, సత్యనారాయణ, ప్రభాకర రెడ్డి, చదలవాడ, ఋష్యేంద్రమణి, ఛాయాదేవి, సురభి బాలసరస్వతి కనిపించారు.


ఈ సినిమాకు మాటలు, పాటలు పింగళి నాగేంద్రరావు సమకూర్చగా, పెండ్యాల నాగేశ్వరరావు స్వరకల్పన చేశారు. ఇందులోని "దేవ దేవ పరంధామ..”, “అలిగితివా సఖీ..”, “అన్నీ మంచి శకునములే..”, “చాలదా ఈ పూజ దేవీ..”, “స్వాముల సేవకు వేళాయె..”, “తఫము ఫలించిన శుభవేళ..”, “మనసు పరిమళించెనే..”, “వేయిశుభములు కలుగు నీకు..” అంటూ సాగే పాటలు విశేషంగా అలరించాయి. ఇక 'గయోపాఖ్యానం'లోని పద్యాలను, ‘పారిజాతాపహరణం'లోని పద్యాన్ని అనువైన చోట వినియోగించుకున్నారు.


యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ ఆ నాడు మేటి నటులుగా రాణిస్తున్నారు. అందులో ఎవరి పేరు ముందుగా ప్రకటించాలో కేవీ రెడ్డికి సమస్యగా మారింది. దాంతో తారాగణం అన్న కార్డ్ పడగానే యన్టీఆర్, ఏయన్నార్ ఇద్దరూ శ్రీకృష్ణార్జునులుగా తెరపై కనిపిస్తారు. వారి తరువాత బి.సరోజాదేవిని సైతం తెరపై చూపించాకే మిగిలిన నటవర్గం పేర్లు ప్రకటించారు. ఈ సినిమా విడుదలయ్యాక అనేక కేంద్రాలలో యన్టీఆర్ ను తెరపైచూడగానే అభిమానులు టెంకాయలు కొట్టి, హారతులు ఇచ్చారు. కార‌ణాలు ఏవైనా ఈ సినిమా త‌ర్వాత 14 ఏళ్ళు యన్టీఆర్, ఏయన్నార్ కలసి నటించలేదు. మళ్ళీ 1977లో యన్టీఆర్ స్వీయ దర్శకత్వంలో నటించి, నిర్మించిన 'చాణక్య చంద్రగుప్త'లో వారిద్దరూ నటించారు. ఆ తరువాత “రామకృష్ణులు, సత్యం శివం” వంటి చిత్రాల్లోనూ అభినయించారు.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: