వినాయక చవితి హిందువులందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకునే అతిపెద్ద పండుగ. ఈ రోజున గణేశుడిని పూజించడం వలన సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం. పూజ చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు. వినాయక చవితి రోజు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఇంటిని, పూజ చేసే స్థలాన్ని శుభ్రం చేయాలి. పరిశుభ్రమైన వాతావరణంలో పూజ చేస్తే మంచిది.

వినాయకుడి పూజకు అవసరమైన అన్ని వస్తువులను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. పత్రి, పూలు, పసుపు, కుంకుమ, గంధం, అగరుబత్తులు, కర్పూరం, దీపారాధన సామాగ్రి, నైవేద్యం కోసం ఉండ్రాళ్ళు, పానకం, వడపప్పు వంటివి సిద్ధం చేసుకోవాలి. మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను పూజ కోసం ఎంచుకోవడం శ్రేయస్కరం. విగ్రహాన్ని శుభ్రమైన పీటపై లేదా పీటపై కొత్త వస్త్రం పరిచి  దానిపై ప్రతిష్టాపన చేయాలి.

గణపతి పూజలో అత్యంత ప్రధానమైనది పత్రి పూజ. వివిధ రకాల పత్రి ఆకులతో వినాయకుడిని పూజించాలి. ఇందులో గరిక, మారేడు, జిల్లేడు, తులసి, మామిడి, రేగు, ఉమ్మెత్త, మొదలైన 21 రకాల పత్రాలు వాడతారు. వినాయకుడికి ఇష్టమైనవి ఉండ్రాళ్ళు, కుడుములు, మోదకాలు. వీటిని బెల్లం, బియ్యపు పిండితో తయారుచేసి నైవేద్యంగా సమర్పించాలి. వీటితో పాటు పండ్లు, పానకం, వడపప్పు, కొబ్బరికాయ కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు.

పూజ చేసేవారు ఉపవాసం ఉండటం మంచిది. పూజ ముగిసే వరకు ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండాలి. పూజ చేసే సమయంలో మనసులో ఎలాంటి చెడు ఆలోచనలు రాకుండా, కేవలం భక్తితో పూజ చేయడం ముఖ్యం.  పూజ పూర్తయిన తర్వాత వినాయకుడి విగ్రహాన్ని దగ్గర్లోని నదిలో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి. మట్టి గణపతిని నిమజ్జనం చేయడం వలన పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. ఈ నియమాలు పాటిస్తూ వినాయక చవితి పూజ చేస్తే గణపతి అనుగ్రహం పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: