టాలీవుడ్‌లో దీపావళి సీజన్‌ పెద్దగా ప్రాధాన్యం పొందినది కాదు. సంక్రాంతి, దసరా వంటి ప్రధాన పండగలతో పోలిస్తే దీపావళి సీజన్‌ను నిర్మాతలు అంతగా టార్గెట్‌ చేయేవారు కాదు. కానీ గత సంవత్సరం ఈ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. లక్కీ భాస్కర్, క, అలాగే అనువాద చిత్రం అమరన్ మూడు సినిమాలూ బాక్సాఫీస్‌ వద్ద ఘన విజయం సాధించడంతో దీపావళి కూడా టాలీవుడ్‌కు లక్కీ సీజన్‌గా మారింది. ఆ హైప్‌ కారణంగానే ఈసారి కూడా నిర్మాతలు దీపావళిని హాట్‌ సీజన్‌గా మార్చేందుకు ముందుకొచ్చారు. ఈసారి దీపావళి రేసులో మొత్తం నాలుగు సినిమాలు బరిలోకి దిగాయి. అందులో మూడు స్ట్రైట్‌ తెలుగు సినిమాలు కాగా, ఒకటి అనువాద చిత్రం. ఈ నాలుగు సినిమాలపై కూడా మోస్తరు అంచనాలు నెలకొన్నాయి. గత ఏడాది లాగా 100 శాతం సక్సెస్ రేట్‌ వస్తుందా అని ప్రేక్షకులు కూడా ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఈసారి ఆరంభం మాత్రం అంతగా బాలేదు.


ముందుగా విడుదలైన “మిత్రమండలి” సినిమాపై భారీ అంచనాలుండేవి. ‘జాతిరత్నాలు’, ‘మ్యాడ్’ తరహాలో నవ్వుల్లో ముంచెత్తుతుందనుకున్నారు. కానీ పెయిడ్ ప్రీమియర్స్ నుంచే నెగటివ్ టాక్‌ రావడంతో సినిమా మొదటి రోజే కుదేలైంది. ప్రేక్షకులు ఈ చిత్రాన్ని పూర్తిగా తిరస్కరించారు. తర్వాత రిలీజైన “డ్యూడ్” మరియు “తెలుసు కదా” సినిమాలు మాత్రం మోస్తరు స్పందనను పొందాయి. “డ్యూడ్” యూత్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నా, పూర్తి సంతృప్తిని ఇవ్వలేకపోయింది. అయితే మంచి ఓపెనింగ్స్ రికార్డ్‌ చేసింది. మరోవైపు, “తెలుసు కదా” క్లాస్ ఆడియన్స్‌ను కొంతవరకు మెప్పించింది. కానీ సామాన్య ప్రేక్షకులు బోరింగ్‌గా ఉందని కామెంట్‌ చేస్తున్నారు. మల్టీప్లెక్స్ సెక్టార్ అర్బ‌న్ యూత్‌లో మాత్రం ఈ సినిమా కొంత సేఫ్‌గా ఉంది.


ఇక రేసులో చివరగా వచ్చిన “కే ర్యాంప్”‌కు విమర్శకుల నుంచి తక్కువ రేటింగ్స్‌ వచ్చినా, మాస్ మరియు యూత్ ప్రేక్షకుల్లో మాత్రం మంచి స్పందన కనిపిస్తోంది. బి, సి సెంటర్లలో సినిమా బలంగా ఓపెనింగ్స్ సాధించింది. 
మొత్తం మీద ఈ దీపావళి సీజన్‌కి స్పష్టమైన విన్నర్‌ కనిపించకపోయినా, “డ్యూడ్” మరియు “కే ర్యాంప్” సినిమాలు బాక్సాఫీస్ పరంగా ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. పూర్తి స్థాయి విజేతగా ఎవరిని చెప్పాలనే దానిపై స్పష్టత రావాలంటే ఇంకా కొన్ని రోజులు గడవాలి. అయితే ఒక విషయం మాత్రం ఖాయం... ఈసారి దీపావళి సీజన్‌ మిశ్రమ ఫలితాలతో ముగిసేలా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: