పైరసీ సినిమాల ప్రధాన సూత్రధారి ఇమ్మడి రవి అరెస్ట్‌తో వెలుగులోకి వస్తున్న విషయాలు ఒక్కొక్కటి సంచలనం రేపుతున్నాయి. ఐబొమ్మ కేసులో రెండో రోజు విచారణ కొనసాగుతుండగా, ఈసారి దర్యాప్తు దిశ పూర్తిగా మారిపోయేలా ఒక కీలక అంశం బయటపడింది. రెండో రోజు విచారణలో భాగంగా sbi టెక్నికల్ టీమ్‌ను సైబర్ క్రైమ్ పోలీసులు పిలిపించి ప్రశ్నలు అడిగారు. అసలు విషయం ఏంటంటే— sbi టెర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్‌కి ఐబొమ్మ లింక్‌ను అనధికారికంగా జత చేశారు అన్న విషయం బయటపడింది. బప్పం టీవీ వంటి పైరసీ వెబ్‌సైట్ల నుండి లింక్‌లు కాపీ చేసి నేరుగా sbi లైఫ్ ఇన్సూరెన్స్ పోర్టల్‌లో పేస్ట్ చేయడం ద్వారా సినిమాలు చూశారని తెలిసింది.


ఈ సంచలన విషయానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో sbi టెక్నికల్ టీమ్ నుండి అన్ని సాంకేతిక వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. అంతే కాదు, పోర్టల్ నుండి ఐబొమ్మ లింక్ ఎలా చేరింది? ఎవరు జత చేశారు? ఎలా తొలగించాలి? భద్రతా లోపం ఎక్కడ జరిగింది? వంటి అంశాలపై సైబర్ క్రైమ్ అధికారులు ముమ్మరంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉండగా, పైరసీ సినిమా వెబ్‌సైట్‌ను నేరుగా ఒక బ్యాంక్ అధికారిక పోర్టల్‌లో లింక్ చేయడం అందరిలో భయాందోళనలు కలిగిస్తోంది. బ్యాంక్ పోర్టల్‌ను హ్యాక్ చేసి ఐబొమ్మ లింక్ జత చేయడం ఎవరూ ఊహించని విషయం. దీనితో, రవి వెనుక మరింత పెద్ద నెట్‌వర్క్ ఉందా? ఐబొమ్మ‌ను నిజంగా ఎవరు ఆపరేట్ చేస్తున్నారు? రవి కేవలం ఫ్రంట్ ఫేస్ మాత్రమేనా? అన్న ప్రశ్నలు మరింత బలంగా వినిపిస్తున్నాయి.



పోలీసుల కస్టడీలో రవి ఉన్న సమయంలోనే ఈ సంఘటన జరగడం అనుమానాలను మరింత పెంచింది. సైబర్ క్రైమ్ అధికారులు ఇప్పుడు రవి వెనక పనిచేస్తున్న మొత్తం టీమ్‌ను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తును ప్రారంభించారు. ఇక మరోవైపు,"iBomma 1", "iBomma 2" వంటి కొత్త పేర్లతో మరికొన్ని వెబ్‌సైట్లు ఒక్కొక్కటిగా తిరిగి ప్రత్యక్షమవుతున్నాయి. ఇవన్నీ ఒకే నెట్‌వర్క్‌కి చెందినవా? లేక మరొక గ్రూప్ రంగంలోకి దిగిందా? అన్న అనుమానాలపై కూడా పోలీసులు దృష్టి పెట్టారు. సంప్రదాయ పైరసీ కేసులకంటే ఇది పూర్తిగా విభిన్నం కావడంతో, ఐబొమ్మ కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దర్యాప్తు అధికారులు వచ్చే రోజుల్లో మరిన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టే అవకాశముందని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: