సజ్జల రామకృష్ణారెడ్డి. ఏపీ ప్రభుత్వంలో ఎంత కీలకంగా వ్యవహరిస్తున్నారో అందరికీ తెలుసు. ప్రభుత్వ సలహాదారుగా.. ప్రభుత్వం తరపున తెరపై కనిపించే వ్యక్తి ఆయనే. దాదాపుగా ఏ మంత్రి కూడా ఆయనలా ఇన్ని సార్లు మీడియా ముందుకు వచ్చి ఉండరు, అంత సేపు ప్రభుత్వం తరపున తమ వాదన అంత సమర్థంగా వినిపించి ఉండరు. ఏ మంత్రికీ దక్కని అరుదైన అవకాశం ఈ ప్రభుత్వంలో సజ్జల రామకృష్ణారెడ్డికి దక్కింది. కానీ ఆయన పోస్ట్ కేవలం సలహాదారు మాత్రమే. అంతకు మించి ఆయన చాలా ఆశించి ఉండొచ్చు, కానీ ఆ సమయానికి సీఎం జగన్ అంతకంటే ఎక్కువగా చేసి ఉండకపోవచ్చు. పోస్ట్ సంగతి పక్కనపెడితే సజ్జలకు ఉన్న ప్రాధాన్యం మాత్రం చాలా గొప్పది. అలాంటిది ఇప్పుడు సజ్జల ఆ పోస్ట్ కి దూరం కాబోతున్నారా..? ఈ చర్చ ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది.

అంతకు మించి..
ప్రభుత్వ సలహాదారు అనే స్థానంలో సజ్జల కీలకంగా వ్యవహరిస్తున్నారు, అందరి మన్ననలు అందుకుంటున్నారు, ముఖ్యంగా సీఎం జగన్ కి మరింత దగ్గరయ్యారు. అయితే ఈ ప్రభుత్వంలో సజ్జలకు అంతకు మించిన గౌరవం ఇవ్వాలంటే కచ్చితంగా చట్ట సభలకు పంపించాల్సిందే. త్వరలో ఏపీనుంచి ఖాళీ అవబోతున్న రాజ్యసభ స్థానాల్లో ఒకటి సజ్జలకు కేటాయిస్తారని అంటున్నారు. అదే నిజమైతే ప్రభుత్వ సలహాదారు అనే పదవికి ఆయన రాజీనామా చేయాల్సి ఉంటుంది.

2022లో రాజ్యసభ సభ్యుల్లో 77మంది పదవీకాలం పూర్తవుతుంది. ఇందులో ఏపీకి సంబంధించి నలుగురు ఎంపీలు దిగిపోతారు. వీరిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఒకరు కాగా.. మిగతా ముగ్గురు ప్రస్తుతం బీజేపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఈ దఫా ఈ నాలుగు స్థానాలు వైసీపీకే దక్కే అవకాశం ఉంది. ఆ నాలుగింటిలో ఒకటి సజ్జలకు ఇస్తారనే ఊహాగానాలు కూడా మొదలయ్యాయి.

మరి ఏపీలో ఎవరు..?
సజ్జల రాజ్యసభకు వెళ్లిపోతే ఏపీలో అంత సమర్థంగా ప్రభుత్వం తరపున తమ వాదన మీడియా ముందు వినిపించేది ఎవరు..? ప్రభుత్వ విధానాలపై విమర్శలు వస్తున్నా.. వాటిని విశదీకరించి వివరించేది ఎవరు..? పంచ్ డైలాగులు లేకుండా, పరుష పదజాలం లేకుండా.. సౌమ్యంగానే వైరి వర్గాలకు చీవాట్లు పెట్టేది ఎవరు..? దీనికి సజ్జలను మించిన ఆల్టర్నేట్ లేరు అనుకుంటే మాత్రం ఆయన్ను సలహాదారుగానే కొనసాగించే అవకాశముంది. కాదు ఆయనకు మరింత సముచిత గౌరవం ఇవ్వాలంటే మాత్రం హస్తినకు పంపించాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: