ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రెండు అంశాలపైనే చర్చ జోరుగా సాగుతోంది. అందులో ఒకటి కరోనా వైరస్ గురించి అయితే... రెండోది ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపైన. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి మార్చి 7వ తేదీ వరకు మొత్తం 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. మార్చి పదవ తేదీన ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తామని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ దిశగా ఇప్పటికే కసరత్తు కూడా ప్రారంభించింది. 5 రాష్ట్రాల్లో అందరి దృష్టి ప్రధానంగా ఉత్తర ప్రదేశ్, పంజాబ్, గోవా రాష్ట్రాలపైనే ఉంది. మరీ ముఖ్యంగా దేశంలోనే అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ అసెంబ్లీని దక్కించుకునేందుకు అన్ని ప్రధాన పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. యూపీలో అధికారంలో ఉన్నపార్టీ... జాతీయ స్థాయిలో పెత్తనం చేస్తుందనేది వాస్తవం. దీంతో... యూపీ కోసం అధికార బీజేపీతో పాటు కాంగ్రెస్, సమాజ్ వాదీ, రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీలు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.

ప్రధానంగా యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో హోరాహోరీ తప్పేలా లేదు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాలున్న యూపీ అసెంబ్లీలో 200 మార్కు దాటేందుకు భారతీయ జనతా పార్టీ తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే ముగ్గురు మంత్రులు, 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీకి గుడ్ బై చెప్పేసి సమాజ్ వాదీ పార్టీలో చేరిపోయారు. ఈ నేపథ్యంలో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బోటాబోటి మెజారిటీతో బీజేపీ గట్టు ఎక్కిన 47 స్థానాలపైనే అందరూ దృష్టి పెట్టారు. గతంలో ఈ 47 స్థానాల్లో బీజేపీ కేవలం పదుల స్థాయిలోనే మెజారిటీ సాధించింది. ప్రస్తుతం యోగీ ఆదిత్యానాథ్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు ఎస్పీ నేత, మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రధానంగా ఈ 47 నియోజకవర్గాల్లోనే అఖిలేష్ రథయాత్ర కూడా నిర్వహించారు. ఈ 47 నియోజకవర్గాల్లో బీజేపీ సీనియర్లే ఎక్కువగా పోటీ చేస్తున్నారు. దీంతో ఈ స్థానాలు కాషాయ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిపోయాయి. ఆయా నియోజకవర్గాల్లో కమలం పార్టీని ఓడిస్తే... అధికారం తమకే దక్కుతుందని బలంగా నమ్ముతున్నాయి విపక్షాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: