జేనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చాలా విచిత్రంగా ఉంది. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వంలోకి వచ్చేయబోతున్నట్లు, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోవటం ఒకటే మిగులున్నట్లు భ్రమల్లో ఉన్నారనే  అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే వచ్చే ఎన్నికలకు సంబంధించి పవన్ తాజాగా మూడు ఆప్షన్లు ఇచ్చారు. అవేమిటంటే మొదటిది బీజేపీ+జనసేన ప్రభుత్వం ఏర్పాటుచేయటం. రెండో ఆప్షన్ ఏమిటంటే బీజేపీ+జనసేన+టీడీపీ ప్రభుత్వం ఏర్పాటుచేయటం.





ముచ్చటగా మూడో ఆప్షన్ ఏమిటంటే జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయటం. అవును మీరు సరిగానే చదివారు. పై మూడు ఆప్షన్లు కూడా పోటీచేయటం కాదుసుమా. ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేయటమే. మొదటి ఆప్షన్ జరిగేపనికాదు. రెండో ఆప్షన్ పవన్ చేతిలో లేదు. రెండో ఆప్షన్ జరగాలంటే దానికి ముందు చాలా తతంగం నడవాల్సుంటుంది. దానికి నరేంద్రమోడి ఆమోదముద్ర పడాల్సుంటుంది. ఇక మూడో ఆప్షన్ అనేది పవన్ నిద్రలోనో, మెలకువగానో కలలో తప్ప జరిగేపనికాదు.





ఎందుకంటే పార్టీ పదేళ్ళయినా ఇంతవరకు జనాలపై ఎలాంటి ప్రభావం చూపలేని పార్టీ ఏదన్నా ఉందంటే అది జనసేన మాత్రమే. పార్టీ అధినేతగా ఉండి పోటీచేసిన రెండుచోట్లా ఓడిపోయిన నేత ఎవరైనా ఉన్నారా అంటే అది పవన్ స్టార్ పవన్ కల్యాణ్ మాత్రమే. ఇంతటి ఘనచరిత్ర కలిగున్న జనసేన వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా అధికారంలోకి వచ్చేస్తుందని పవన్ తప్ప ఇంకెవరు అనుకోవటంలేదు.





ఇప్పటికిప్పుడు ఎన్నికలంటే  175 నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను చెప్పమంటే పవన్ చేతులెత్తేయాల్సిందే. ఎందుకంటే మహాఅయితే ఒక 15 నియోజకవర్గాల్లో తప్ప గట్టి అభ్యర్ధులే లేరు. అసెంబ్లీకే గట్టి అభ్యర్ధులను పెట్టుకోలేని పవన్ ఇక పార్లమెంటు అభ్యర్ధులను ఏమి రెడీచేస్తారు ? 15 లేదా 20 చోట్లకన్నా గట్టి అభ్యర్ధులను చెప్పలేని జనసేన వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వం ఏర్పాటుచేస్తుందని చెప్పటమే పవన్లోని అజ్ఙానికి నిదర్శనం. క్షేత్రస్ధాయిలోని వ్యవహారాలు చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో అసలు పవన్ గెలుస్తారా అనే డౌటు కూడా వస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: