కొన్ని కొన్ని సున్నిత‌మైన అంశాలే కానీ..ఎలాంటి విప‌రిణామాల‌కు దారితీస్తాయో తెలియ‌జేసేందుకు ఇదో ఉదాహ‌ర‌ణ‌. ఇంటర్మీడియేట్‌లో నూటికి 92 శాతం మార్కులు తెచ్చుకున్న ఓ విద్యార్థి...చ‌దువుపై ఇష్టం లేక త‌న‌కు తానే...కిడ్నాప్ డ్రామా ఆడింది. ఇందుకు ఆమెకు స్ఫూర్తిని ఇచ్చింది ఇటీవ‌ల విడుద‌లైన రాక్ష‌సుడు సినిమా. సాక్షాత్తు పోలీసులే ఈ విష‌య్యాన్ని ద‌ర్యాప్తులో వెల్ల‌డించి ఆశ్చ‌ర్య‌పోయారు. గుంటూరు జిల్లా భట్టీప్రోలు గ్రామానికి చెందిన వర్షిణి ఇలా ఇటు త‌ల్లిదండ్రుల‌ను అటు పోలీసుల‌ను ముప్పుతిప్ప‌లు పెట్టింది. 


92 శాతం మార్కులతో ఇంటర్మీడియేట్ పాసైన వ‌ర్షిణిని ఆమె తల్లిదండ్రులు సోమాజిగూడలోని ఓ కాలేజీ బీఎస్సీలో చేర్పించి స్థానికంగా ఉన్న ఓ లేడీస్ హాస్టల్‌లో జ‌యిన్ చేశారు. అయితే, వ‌ర్షిణి చేరిన కాలేజీలో పూర్తిగా ఇంగ్లీషు మాద్యమం ఉండ‌టం,  కంప్యూటర్ సైన్స్‌పై  అవగాహన లేక‌పోవ‌డం, అమ్మానాన్న‌ల‌కు దూరంగా ఉండ‌టం వంటి కార‌ణాల‌తో ఆమె తీవ్ర మానసిక ఒత్తిడికి లోనైంది. ఫలితంగా ఈ చదువును ఎలాగైనా తప్పించుకోవాలని భావించింది. చివరకు కిడ్నాప్ డ్రామా ఆడింది. బక్రీద్ పండుగ సందర్భంగా మూడు రోజులు సెలవులు రాగా, రాత్రి 10గంటల సమయంలో కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకొని రైలులో స్వగ్రామానికి వెళ్లింది. ఉదయం ఇంటికి వెళ్లిన ఆ బాలిక తల్లిదండ్రులు చూసి సోమాజిగూడలో తనను గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారని చెప్పింది.


దీంతో త‌ల్లిదండ్రులు గుంటూరు నుంచి వ‌చ్చి హైద‌రాబాద్ పోలీస్ స్టేష‌న్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు బాలిక చెప్పిన కథనం ప్రకారం సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేయ‌గా ఆశ్చ‌ర్య‌పోయే వివ‌రాలు తెలిశాయి. బాలిక తడబడుతుండటాన్ని గుర్తించిన పోలీసులు నేను సైతం, కమ్యూనిటీ సీసీ టీవీ ప్రాజెక్టుల్లో భాగంగా అమర్చిన సీసీ కెమెరాలను ప‌రిశీలించ‌గా...బాలిక కిడ్నాప్ కథలో అస‌లు విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. సోమాజిగూడలోని కత్రియా హోటల్ రోడ్డు నుంచి బేగంపేట, సికింద్రాబాద్, కాచిగూ డ వరకు ఆమె ఒంటరిగానే వెళ్లడాన్ని పోలీసులు ఫుటేజీలో గుర్తించారు. దీంతో బాలిక కిడ్నాప్ డ్రామా ఆడినట్లు పోలీసులు తేల్చేశారు. 12వ తేదీన‌ బంధువుల ఇంటికి వెళ్థామని అనుకున్న ఆ బాలిక బేగంపేట మెట్రో స్టేషన్‌కు నడుచుకుంటూ వెళ్లింది. అక్కడి నుంచి మెట్రో రైలులో ప్యారడైజ్ స్టేషన్‌లో దిగి అక్కడి నుంచి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. అక్కడే తన ప్రయాణ గమనాన్ని మార్చుకుంది. లింగంపల్లి-ఫలక్‌నూమా ఎంఎంటీఎస్ ఆగి ఉండటంతో అందులో ఎక్కింది. అక్కడి నుంచి కాచిగూడ రైల్వే స్టేషన్‌లో దిగి అక్కడే సిద్ధంగా ఉన్న రేపల్లే ప్యాసింజర్ రైలు ఎక్కి ఇంటికి వెళ్లిపోయింద‌ని వెల్ల‌డించారు. 


కిడ్నాప్ డ్రామా ఆడిన విషయంలో పోలీసు ఉన్నతాధికారుల సూచనల మేరకు చర్యలు తీసుకుంటామని పంజాగుట్ట పోలీసులు తెలిపారు. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకోవడం ఇష్టం లేదని, స్వ గ్రామంలోనే చదువుకుంటానని త‌మ విచారణలో తేలిందని, ఇటీవల విడుదలైన రాక్షసుడు సినిమా చూసి ఈ కిడ్నాప్‌నకు ప్రేరణ పొందినట్లు ఆమె వెల్లడించిందని పోలీసులు తెలిపారు.


మరింత సమాచారం తెలుసుకోండి: