ఈరోజుల్లో పాన్ కార్డు ఉపయోగించడం కామన్ అయ్యింది. ప్రత్యేకించి పెద్ద మొత్తాల్లో లావాదేవీలు నిర్వహించేవారు తప్పకుండా పాన్ కార్డు వినియోగించాల్సి ఉంటుంది. ఇంతకీ.. మీ ఆధార్ కార్డును పాన్ కార్డుతో అనుసంధానం చేశారా.. చేయలేదా.. ఇలా చేసేందుకు ఈరోజే ఆఖరి రోజు.. ఈ నెల 30వ తేదీ వరకూ ఇందుకు కేంద్రం గడువు విధించింది. అలా అనుసంధానం చేయకపోతే.. పాన్‌కార్డుతో లావాదేవీలు చెల్లవు అని కేంద్రం ప్రకటించింది.


కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నోటిఫికేషన్‌ ప్రకారం పాన్‌కార్డు, ఆధార్‌ కార్డు కలిగిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా రెండింటిని అనుసంధానం చేసుకోవాలి. ఇన్‌కం ట్యాక్స్‌ రిటర్న్‌ల ఫైలింగ్‌కు ఆధార్‌ నంబర్‌ కూడా అవసరం. పాన్‌కార్డు లేనివారు ఆధార్‌తో ఐటీ రిటర్న్స్ తో దాఖలు చేయొచ్చు.


మరి ఆధార్ ను పాన్ తో అనుసంధానం చేయడం ఎలా అంటారా.. పన్ను చెల్లింపుదారులు ఇన్‌కం ట్యాక్స్‌ ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ అవ్వాలి. ఆదాయపన్ను శాఖ ఇ-ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ www.incometaxindiaefiling.gov.in లో లాగిన్‌ అయి ప్రొఫైల్‌ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. అక్కడ కనిపించే ముఖచిత్రంలో ఎడమ భాగంలో లింక్‌ ఆధార్‌ న్యూ అనే ఆప్షన్‌ క్లిక్‌ చేయాలి. ఒక విండో ఓపెన్‌ అవుతుంది.


అక్కడ పాన్‌కార్డు సంఖ్య, ఆధార్‌కార్డు సంఖ్య, పేరు వివరాలను పూర్తి చేయాలి. ఆదాయపన్ను శాఖ ఈ వివరాలను సరిచూస్తుంది. క్రాస్‌ చెక్‌ పూర్తి అయిన తర్వాత మీ నంబర్, క్యాప్చా కోడ్‌ ఎంటర్‌ చేయాలి. వ్యాలిడేషన్‌ పూర్తయిన తర్వాత పాన్‌కార్డుతో ఆధార్‌ అనుసంధానం జరుగుతుంది. వివరాలన్నీ సరిపోతేనే ఈ అనుసంధాన ప్రక్రియ సజావుగా జరుగుతుంది. అనుసంధానం పూర్తయితే మీకు సమాచారం అందుతుంది.


అయితే మొబైల్ ఎస్‌ఎంఎస్‌ ద్వారా.. కూడా ఆధార్, పాన్ లింక్ చేసుకోవచ్చు. దీని కోసం యూఐడీపీఏఎస్‌ అని ఆంగ్ల అక్షరాల్లో టైప్‌ చేసి స్పేస్‌ ఇచ్చి ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి స్పేస్‌ ఇచ్చి పాన్‌ నంబర్‌ ఎంటర్‌ చేసి 567678కు ఎస్‌ఎంఎస్‌ పంపాలి. ఆధార్‌కార్డుతో లింక్‌ అయిన మొబైల్‌ నంబర్‌తోనే ఎస్‌ఎంఎస్‌ పంపాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: