అవినీతికి దూరంగా ఉండాలి.. పార్టీలకు అతీతంగా మన సేవలు ఉండాలి..ఇదీ జగన్ తరచూ తన పార్టీ నేతలకు చెబుతున్నమాటలు. కానీ రాజకీయ నాయకులు అవినీతికి దూరంగా ఉంటారా.. అది జరుగుతుందా అన్న అనుమానాలు చాలా ఉన్నాయి. అయితే జగన్ ఈ విషయంలో పట్టుదలగా ఉన్నారు. దీనికి సంబంధించిన కొన్ని వార్తలు ఆసక్తిరేపుతున్నాయి.


కొందరి వద్ద మామూళ్లు దండుకున్న మంత్రుల వద్ద నుంచి కూడా జగన్ సొమ్ము తిరిగి వసూలు చేయించి మళ్లీ ఇప్పించాడని కూడా వార్తలు వచ్చాయి. అందుకే వైసీపీ ఎమ్మెల్యేలు కాస్త జాగ్రత్త పడుతున్నారు. ఎందుకొచ్చిన గొడవ అంటూ ముందుగానే జాగ్రత్తపడుతున్నారు.


అవును తాజాగా నరసరావు పేట ఎమ్మెల్యే చేసిన ప్రకటన ఇందుకు సాక్ష్యంగా కనిపిస్తోంది. ఆయన అధికారులతో మాట్లాడుతూ ఏమన్నారో తెలుసా.. అధికారులు అవినీతి రహితంగా పనిచేయాలని నరసరావుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం నరసరావుపేట మున్సిపల్‌ కార్యాలయంలో డయల్‌ యువర్‌ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.


ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఫోన్‌ ద్వారా స్వీకరించారు. తన పేరు చెప్పుకుని పైరవీలు చేసే వారిని దూరంగా పెట్టాలని అధికారులకు ఎమ్మెల్యే గోపిరెడ్డి సూచించారు. ప్రజా సమస్యలపై వెంటనే స్పందించాలని కోరారు. పలు సమస్యలపై స్పందించిన ఎమ్మెల్యే.. అనంతరం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.


అవును ఎమ్మెల్యేనో, మంత్రో అయితే చాలు.. వారి పేరు చెప్పుకుని చాలా మంది పెత్తనం చెలాయిస్తుంటారు. తమ పబ్బం గడుపుకుంటారు. అందుకే తన పేరు చెప్పుకుని వచ్చినా పట్టించుకోవద్దని ఏకంగా ఎమ్మెల్యే చెబుతున్నారు. మరి ఇక అలా చేస్తే ఎమ్మెల్యే పరపతి ఏముంటుంది అనుకుంటున్నారా.. ఆయన పేరు చెప్పేవారు ఉంటే ఆయనే స్వయంగా ఫోన్ చేసి చెబుతారేమో మరి. ఏదేమైనా జగన్ వార్నింగ్ బాగానే పని చేస్తోందని చెప్పొచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: