తెలంగాణ‌లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న స‌మ్మె విష‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ తీవ్రంగా స్పందించిన సంగ‌తి తెలిసిందే. కార్మికులు ఉద్యోగాల్లో చేర‌క‌పోతే వారిని తొల‌గించ‌డం త‌ప్ప‌ద‌ని అన్నారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్య‌ల‌తో సెల్ఫ్ డిస్మిస్ అంశం తీవ్రంగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. అయితే, తమిళనాడులో ప్రభుత్వ  డాక్టర్లు సమ్మె చేస్తుండ‌గా....రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి విజయభాస్కర్  సమ్మెపై తీవ్రంగా స్పందించారు. వెంటనే విధుల్లో చేరకపోతే వారిని శాశ్వతంగా ఉద్యోగాల నుంచి తొలగిస్తామని స‌రిగ్గా తెలంగాణ సీఎం రీతిలోనే వ్యాఖ్యానించార‌ని ప‌లువురు పేర్కొంటున్నారు.


గత శుక్రవారం నుంచి త‌మిళ‌నాడు రాష్ట్రంలోని 15 వేలమంది ప్రభుత్వ డాక్టర్లు సమ్మె చేస్తున్నారు.  సరైన జీతాలు, పదోన్నతులు డిమాండ్​ చేస్తూ.. దాదాపు 18 వేల మంది వైద్యులు ధర్నాకు దిగారు. విధులు బహిష్కరించి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు రోడ్డెక్కారు. అత్యవసర సేవలు మినహాయించి... మిగతా వైద్య సేవలన్నీ పూర్తిగా నిలిపివేశారు.ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే చేరిన రోగులు అవస్థలు పడుతున్నారు. వైద్య సేవలు అందక ఔట్​పేషెంట్​ వార్డుల్లో వందలాది మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. అయినా... ఇప్పటివరకు ఆ రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను శాంతి పరిచే ప్రయత్నాలేవీ చేయలేదు. మ‌రోవైపు ఈ ప‌రిస్థితిని సీరియస్‌గా తీసుకున్న మంత్రి విజయభాస్కర్ తాజాగా మీడియాతో మాట్లాడుతూ ఘాటుగా స్పందించారు. ప్రజలకు ఇబ్బంది కలిగేలా డాక్టర్లు సమ్మె చేస్తున్నారని వారు వెంటనే విధుల్లో చేరాలని సూచించారు. విధుల్లో చేరకపోతే వారి స్థానంలో కొత్త డాక్టర్లు ఉద్యోగాల్లో చేరుతారని స్పష్టం చేశారు. అంతేకాదు సమ్మె చేస్తున్న వారిని తొలగిస్తామని హెచ్చరించారు.


మ‌రోవైపు తెలంగాణలో సైతం ఇదే రీతిలో ప్ర‌భుత్వం ఆర్టీసీ కార్మికుల‌ను హెచ్చ‌రించిన సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ జేఏసీ నేతృత్వంలో జరుగుతున్న సమ్మె చట్ట విరుద్దమని పేర్కొంటూ విధులకు హాజరుకాకుండా స్వచ్ఛందంగా తొలగిపోయారని చెబుతూ సెల్ఫ్ డిస్మిస్ అయ్యారని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం ఎక్కడా వారిని తొలగించలేదని.. అదే సమయంలో వారికి వారే తొలగిపోయారని చెప్పారు. ఏ ఒక్క ఉద్యోగిని ప్రభుత్వం తొలగించకుండా ..  ఆ పరిస్థితిని వారికి వారే తెచ్చుకున్నారని ప్రభుత్వం చెబుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: