తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆర్టీసీ స‌మ్మెకు ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చి...అనంత‌రం ఉద్యోగుల‌కు వరాల వర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. ఆర్టీసీ స‌మ్మెకు ముగింపు ప‌లికిన అనంత‌రం, ఆర్టీసీ స్థితిగతులపై, దాని పురోగతికి తీసుకోవాల్సిన చర్యలపై ప్రతి ఆర్టీసీ డిపో నుంచి ఐదుగురు చొప్పున ఉద్యోగులతో జనహితలో సమావేశం అయిన సంద‌ర్భంగా అనేక వ‌రాలు ప్ర‌క‌టించారు. దీంతోపాటుగా సంస్థ‌కు సంబంధించిన ప‌లు నిర్ణ‌యాలు సైతం తీసుకున్నారు. ఇలా తీసుకున్న నిర్ణ‌యాల్లో ఒక‌దానిపై తాజాగా ఆయ‌న కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. 

 

ఆర్టీసీని లాభాల బాట‌లో ప‌ట్టించేందుకు స‌రుకు ర‌వాణ సేవ‌లు ప్రారంభించాల‌ని ఆ స‌మ‌యంలో కేసీఆర్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. దీనికి అధికారులు ఏర్పాట్లు చేశారు. అయితే,  సరుకు రవాణా చేసే కార్గో బస్సులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఫోటో పెట్టడానికి ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు మీడియాలో ప్రచారం జరిగింది. దీన్ని సీఎం కె. చంద్రశేఖర్ రావు తప్పు పట్టారు. ఆర్టీసీ బస్సులను సరుకు రవాణాకు ఉపయోగించడం వల్ల ప్రజలకు సేవలు అందించడం, ఆర్టీసీ లాభాల్లో పయనించడం తన లక్ష్యం అన్నారు. బస్సులపై ఫోటోలు వేయించుకుని ప్రచారం చేసుకోవాల్సిన అవసరం తనకు లేదని, ఈ ప్రతిపాదన ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు సేవలు అందించాలే తప్ప, దాంతో చౌకబారు ప్రచారం పొందడం తమ అభిమతం కాదని అధికారులకు సీఎం స్పష్టంగా చెప్పారు. ముఖ్యమంత్రి అభిప్రాయంతో సీఎంఓ ప్రత్యేక కార్యదర్శి పి. రాజశేఖర్ రెడ్డి ఆర్టీసీ ఎండికి నోట్ పంపారు. కార్గో బస్సులపై ముఖ్యమంత్రి ఫోటో వేయరాదని స్పష్టంగా సూచించారు.

 


కాగా, ఉద్యోగుల‌తో నిర్వ‌హించిన ఆత్మీయ సమావేశం, అనంత‌రం వారితో క‌లిసి భోజనం చేసిన స‌మ‌యంలో....ఆర్టీసీ ఉద్యోగాలకు ఎలాంటి ఢోకా లేదంటూ కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. సెప్టెంబర్ వేతనాన్ని సోమవారం ఇస్తామని ప్రకటించారు. సమ్మెకాలానికి కూడా వేతనాలను తర్వాతి రోజుల్లో ఒకే దఫాలో ఇస్తామని తెలిపారు. సమ్మెకాలంలో మరణించిన ఉద్యోగుల కుటుంబంలో ఒకరికి ఎనిమిది రోజుల్లోగా ఉద్యోగం ఇవ్వడంతోపాటు, ప్రభుత్వం తరఫున రెండు లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. రిటైర్మెంట్ వయస్సును 60 ఏళ్ల‌కు పెంచుతామని చెప్పారు. మహిళలకు రాత్రి డ్యూటీలు రద్దుచేస్తున్నట్టు చెప్పిన సీఎం.. వారికి ప్రసూతి సెలవుతోపాటు చైల్డ్‌కేర్ లీవ్ ఇస్తామని ప్రకటించారు. వచ్చే బడ్జెట్ నుంచి ఆర్టీసీకి వెయ్యి కోట్లు ఇస్తామని చెప్పారు. ఇందులో ప‌లు నిర్ణ‌యాలు ఇప్ప‌టికే అమ‌లు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: