ఉండవల్లి శ్రీదేవి...గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే. తొలిసారి వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన శ్రీదేవి, 8నెలల పనితీరు గురించి మాట్లాడుకోవడం కంటే ముందు రాజధాని గురించి మాట్లాడుకోవడం మంచిది. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానుల కాన్సెప్ట్ వల్ల కాస్త ఎక్కువగా కష్టాలు వచ్చింది శ్రీదేవికే. ఎందుకంటే రాజధాని అమరావతి గ్రామాలు మెజారిటీ తాడికొండ నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. అలాగే తాడికొండ నియోజకవర్గం మొత్తం సి‌ఆర్‌డి‌ఏ పరిధిలో ఉంది.

 

దీంతో మూడు రాజధానులని ఈ ప్రాంత ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత రెండు నెలలుగా ఆందోళనలు చేస్తున్నారు. అమరావతి కూడా ఓ రాజధానిగా అభివృద్ధి చెందుతుందని చెబుతున్న వారు వినడం లేదు. రైతులకు న్యాయం చేస్తామన్న ఒప్పుకోవడం లేదు. మొత్తం రాజధాని అమరావతిలోనే ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఫలితంగా ఈ ప్రభావం అంతా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న శ్రీదేవిపై బాగా పడింది. శ్రీదేవి అమరావతి సమస్యపై పెద్దగా స్పందించకపోవడం వల్ల, రైతులు ఆగ్రహంతో ఉన్నారు. దీని వల్ల నియోజకవర్గంలో చాలావరకు శ్రీదేవిపై వ్యతిరేకిత వచ్చింది.

 

ప్రభుత్వం ఏదైనా ఊహించని విధంగా అమరావతి విషయంలో నిర్ణయం తీసుకుంటే తప్ప అక్కడి ప్రజలు ఆగేలా కనిపించడం లేదు. వారు ఆగ్రహం అలాగే కొనసాగితే భవిష్యత్‌లో శ్రీదేవికి మరిన్ని కష్టాలు ఎదురవడం ఖాయం. ఇక కాసేపు రాజధాని విషయం పక్కనబెడితే, ఎమ్మెల్యేగా పని చేయడంలో కూడా శ్రీదేవి కాస్త వెనుకబడి ఉన్నారనే తెలుస్తోంది. రాజధాని గ్రామాల్లో వ్యతిరేకిత ఉండటం వల్ల, ఆమె అటు వైపు వెళ్ళడం కష్టమైపోయింది. కాకపోతే తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో పర్యటిస్తూ, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తున్నారు.

 

అటు ప్రభుత్వ పథకాలని ప్రజలకు చేరువయ్యేలా చేస్తున్నారు. నియోజకవర్గంలో సీసీ రోడ్స్ నిర్మాణం, సైడ్ డ్రైనేజీ కాలువల నిర్మాణం మొదలగు అభివృద్ధి కార్యక్రమాలను బాగానే చేస్తున్నారు. ఇక ఈ మధ్య ఈమె అసెంబ్లీలో కాస్త జగన్‌ని ఎక్కువ పొగిడి సోషల్ మీడియాలో విమర్శలు పాలయ్యారు. అయితే టీడీపీపై విమర్శలు చేస్తున్న, ఆ విమర్శలని ప్రజలు పెద్దగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు.  మొత్తం మీద అయితే శ్రీదేవికి రాజధాని కష్టాలు బాగా ఉన్నాయి. మరి అవి ఎప్పటికి తగ్గుతాయో చెప్పలేని స్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: