ప్రపంచంలోలోని రచయితలందరూ... అమ్మ కూచిలే.. అవును. వారి రచనలు ఒకసారి మనం చూసుకుంటే.. అందులో అమ్మ పాత్ర తప్పకుండా ఉంటుంది. ఒక్కొక్కరిది ఒక్కోశైలి అంతే. కొందరు సరళంగా రాస్తే, ఇంకొందరు ఆర్ధ్రతతో రాస్తారు. ఇక మన తెలుగు సినీ రచయితలను తీసుకుంటే... ఆనాటి సముద్రాల రామానుజాచార్యుల నుంచి ఈనాటి మిట్టపల్లి సురేందర్‌ వరకూ అమ్మ మీద ఎంత మంది ఎన్ని పాటలు రాసారో మన ఊహకు అందదు.

 

"అమ్మేగా తొలిపలుకు నేర్చుకున్న భాషకి; అమ్మేగా ఆదిస్వరం ప్రాణమనే పాటకి.." ఈ పదాల పొందిక గాని మనం చూసుకుంటే, రచయిత యెంత అనుభవించి రాశాడో మనకు అర్ధం అవుతుంది. అమ్మ పాట రాయమంటే, మన చలనచిత్ర గీత రచయితలు సంబరపడి మరి రాస్తారు కాబోలు.. అది వారు, వారికొచ్చిన అదృష్టంగా భావిస్తారు. అక్షరాలు నేర్పిన అమ్మకు అక్షరహారతి ఇచ్చే అవకాశం ఇచ్చినందుకు వారు ఎంతగానో సంతోషిస్తారు.

 

ఆ సమయంలో వారి కలం నుంచి ప్రవహించే పాట... యెంత మధురంగా ఉంటుందంటే... అది అమ్మప్రేమంత కమ్మగా ఉంటుంది. "పాడే ఈ పాట పేరు.. సాగే నా బాట పేరు అమ్మ" అని చెప్పుకున్న సిరివెన్నెల గారికి నమస్కరించక తప్పదు. మనసు కవి అయన. ఇక అమ్మ పాటలు రాయ వలసిన ప్రతిసారీ ఆ అక్షరాల వెనక మా అమ్మ జానకమ్మే ఉంటుందనే వారు శ్రీ సుద్దాల అశోక్‌తేజ గారు.. "దునియాతో నాకేంటమ్మా నీతో ఉంటే చాలమ్మా" అని పాడతారు అయన, అన్నట్లు అయన మంచి సింగర్ కూడా. 

 

ఫలానా అమ్మ పాట ఎలా రాశారని ఏ రచయితను అడిగినా కూడా... అమ్మ కొంగు పట్టుకుని తిరిగిన పసిమనసు జ్ఞాపకాలే అలా అక్షరాలుగా ఉద్భవించాయని ఎంతో గర్వంగా చెబుతారు అందరూ. వేటూరికి అమ్మభాషంటే ప్రాణం... అయన ఒక సందర్భంలో అన్నట్లు గుర్తు.... మన భాషలోకి బయటి నుంచి పదాలను తెచ్చుకోవచ్చు... కానీ, ఉన్నవి తీసేయడం మహా ఘోరం... అనేవారు. ఇక అమ్మకు మారుగా మమ్మీ అంటున్న వాళ్లకు కౌంటరుగా అయన ఓ మాట నిక్కచ్చిగా చెప్పారు..."అమ్మ అనేది అచ్చ తెలుగుమాటరా.. జన్మజన్మకదే నిత్య వెలుగుబాటరా.. అని హితబోధ చేశారు. ఏది ఏమైనా ఈనాటి తరానికి అటువంటి భావన ఉందనేది ఒక భ్రమే అవుతుందేమో....

మరింత సమాచారం తెలుసుకోండి: